గాంధీ ఆలోచనల స్ఫూర్తితోనే ప్రజా పాలన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గాంధీ ఆలోచనల స్ఫూర్తితోనే ప్రజా పాలన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ప్రజలందరికీ సమాన అవకాశాలే లక్ష్యం
  •     మహాత్మా గాంధీ 157 జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     గాడ్సేను అనుసరిస్తున్న వారు గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు
  •     అలాంటి దేశ ద్రోహులను బహిష్కరించాలన్న భట్టి

హైదరాబాద్, వెలుగు: గాడ్సేను అసుసరిస్తున్న కొందరు జాతిపిత మహాత్మా గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీని హత్య చేసిన గాడ్సే భావజాలాన్ని సమర్థించే ధోరణులు దేశంలో కనిపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దేశ ద్రోహులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. 

శుక్రవారం ఎల్బీ స్టేడియంలో గాంధీ గ్లోబల్  ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157 జయంతి వేడుకలు నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ఈ కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీయిజమే ప్రపంచానికి మార్గదర్శకమన్నారు. గాంధీ ఆలోచన స్ఫూర్తితోనే తమ ప్రజా పాలన కొనసాగుతున్నదని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు, సామాజిక గౌరవం, విద్య కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం చుట్టామన్నారు. కులం, మతం అనే బేధం లేకుండా అన్ని వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునేందుకు ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

గాంధీ మార్గమే దేశానికి శ్రీరామ రక్ష: మహేశ్ గౌడ్

గాంధీ చూపిన మార్గమే దేశానికి శ్రీరామ రక్ష అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయవచ్చన్నారు. గాంధీ స్ఫూర్తితో  సమాజ సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. గాంధీ చూపిన మార్గం నేటి యువతకు, విద్యార్థులకు ఎంతో ఆదర్శనీయమని, ఆయన సాగించిన  పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

గాంధీ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం: మంత్రి వివేక్ వెంకటస్వామి

మహాత్మా గాంధీ జీవితం, ఆయన పోరాటం, ఆలోచనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గాంధీ గొప్పతనం కేవలం పోరాటం చేయడం మాత్రమే కాదని, లక్షలాది మంది ప్రజలను ఒకే లక్ష్యం కోసం ఏకం చేయడం గొప్ప విషయమని అన్నారు. గాంధీ జీవితం నుంచి స్ఫూర్తి పొంది సత్యం, అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతూ సమాజానికి, దేశానికి సేవ చేయాలని మంత్రి వివేక్ సూచించారు.

గాంధీ ఆశయాలతో ముందుకు: మంత్రి పొన్నం

గాంధీ ఆశయాలను ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకుపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన ఆశయాల స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గాంధీ స్ఫూర్తితోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

1,157 చరకాల ప్రదర్శన
గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ఎల్బీ స్టేడియంలో 1,157 చరకాలను ప్రదర్శించారు. అలాగే, 1,157 మంది బాలలు గాంధీ వేషంలో హావభావాలు ప్రదర్శించారు. వీటితో పాటు ఒక ఫీటు ఎత్తు ఉన్న 1,157 గాంధీ విగ్రహాల ప్రదర్శన, గాంధీ జ్ఞాన దర్శనం, యోగా ప్రదర్శన, క్రీడా పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు గాంధీ భవన్ లో మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే, లాల్ బహుదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికీ  నివాళులు అర్పించారు.