- ఐదు నెలల్లో తయారు చేసిన ఆలయ కమిటీ
- తుది దశలో మాడవీధుల పనులు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయానికి దసరా పర్వదినం నాటికి సరికొత్త శోభ రానుంది. నాలుగైదు దశాబ్దాల తర్వాత ఇటీవలే ఆలయంలో మరోసారి ప్రధాన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయగా.. తొలిసారిగా అమ్మవారి వాహన సేవకు కామాక్షి ఆలయం తరహాలో ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. రథం తయారీ దాదాపు పూర్తయింది.
దసరా సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రుల్లో నూతన రథంతో అమ్మవారికి ఉత్సవ సేవలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిల్పి గిర్మాజి ప్రవీణ్‌చారి ఆధ్వర్యంలో రథం తయారీ పనులకు ఏప్రిల్ 30న పూజలు నిర్వహించారు. పనుల కోసం భద్రకాళి ఆలయంలో 40–50 అడుగుల ఎత్తులో ప్రత్యేక షెడ్డు నిర్మించారు. దాదాపు ఐదు నెలల్లో రథం తయారీని పూర్తి చేశారు.
టేకు, నార వేప కలపతో..
భద్రకాళి ఆలయ మాడవీధుల మీదుగా అమ్మవారికి నిర్వహించే వాహన సేవ రథాన్ని స్ట్రాంగ్‌గా తయారు చేశారు. ధ్వజస్తంభాలు, రథాల తయారీలో అడవుల్లో అరుదుగా లభించే నార వేప కలపను వినియోగిస్తున్నారు. ఈ కలప విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. రైలుపట్టాల తయారీలోనూ దీన్ని వినియోగిస్తున్నారు. 36 అడుగుల పొడవుతో సేవా రథాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన అర్చకులతో పాటు ధర్మకర్తల కమిటీ, శిల్పుల బృందం మహారాష్ట్రలోని నాగ్‌పూర్, చంద్రపూర్ జిల్లా బల్హార్షా, తెలంగాణలోని ఆసిఫాబాద్ ప్రాంత అడవుల్లో మేలు రకం టేకు, నార వేప కలపను ఎంపిక చేశారు.
మాడవీధుల్లో వాహన సేవ..
భద్రకాళి ఆలయం చుట్టూ టీటీడీ తరహాలో అమ్మవారి వాహన సేవల కోసం మాడవీధుల నిర్మాణం చేపడుతున్నారు. అనంతరం నాలుగు దిక్కుల్లో రాజగోపురాలు ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో రూ.30 కోట్లు కేటాయించారు. ఆలయానికి మూడువైపులా ఉన్న చెరువు, కొండ, లోయ ప్రాంతాలను 30 అడుగుల వెడల్పుతో మాడవీధులుగా మార్చాల్సి ఉంది. ఈ క్రమంలో లోయను మట్టితో పూడ్చారు.
అడ్డుగా ఉన్న కొండను జేసీబీలతో తొలిచారు. మరోవైపు కొందరు పేదలు వేసుకున్న గుడిసెలు అడ్డుగా ఉండటంతో వారికి ఇటీవలే ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించారు. పనులను వేగవంతం చేసేందుకు శుక్రవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులతో కలిసి ఆలయంలో పర్యటించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల నాటికి మాడవీధులను తాత్కాలికంగా పూర్తి చేసి రథోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు.
