హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' (Avengers: Doomsday) కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరతీస్తూ.. ఇండియాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టికెట్ల అమ్మకాలు మొదలైన కొన్ని గంటల్లోనే భారీ డిమాండ్ కనిపిస్తోంది. అయితే ఈ సినిమా టికెట్ ధరలు మాత్రం సామాన్య ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా రూ.4,500 వరకు ధరలు పలుకుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.
టికెట్ల కోసం ఫ్యాన్స్ పోటీ..
నవంబర్ 16 అర్ధరాత్రి నుంచి BookMyShow, District యాప్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి వంటి నగరాల్లో తొలిరోజు షోలకు భారీ స్పందన వస్తోంది. కొన్ని స్క్రీన్లలో టికెట్లు ఇప్పటికే సోల్డ్ అవుట్ అయ్యాయి. BookMyShowలో గంటకు సుమారు 7 వేల నుంచి 10 వేల టికెట్లు అమ్ముడవుతున్నట్లు సమాచారం..
టికెట్ రూ.4,500.. ఎందుకంత రేటు?
ఈ సినిమా టికెట్ ధరలే ఇప్పుడు అసలు చర్చకు కారణమయ్యాయి. ముంబైలోని నవీ ముంబై సినీపోలిస్‌లో ప్రత్యేక ప్రీమియం ఫార్మాట్‌లో ఒక టికెట్ ధర ఏకంగా రూ.4,300కు చేరినట్లు సమాచారం. మరోవైపు కొన్ని ప్రధాన నగరాల్లో సాధారణ టికెట్లు రూ.420 నుంచి ప్రారంభమవుతుండగా, లగ్జరీ రిక్లైనర్ సీట్ల ధరలు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. అయినా ఫ్యాన్స్ వెనుకాడటం లేదు.
హైదరాబాద్‌లోనూ భారీ క్రేజ్!...
హైదరాబాద్‌లోనూ ఈ సినిమాకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. నగరంలో గంటకు 8 వేలకుపైగా టికెట్లు అమ్ముడయినట్లు సమాచారం. PVR, AMB సినిమాస్, అల్లు సినిమాస్ వంటి థియేటర్లలో వివిధ ఫార్మాట్లలో షోలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ టికెట్ ధరలు సుమారు రూ.335 నుంచి రూ.774 వరకు ఉన్నాయి.
డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్..
ఈ సినిమాలో అసలైన స్పెషల్ అట్రాక్షన్ రాబర్ట్ డౌనీ జూనియర్. ఇన్నాళ్లూ ఐరన్ మ్యాన్‌గా అభిమానులను అలరించిన ఆయన ఇప్పుడు భయంకరమైన విలన్ డాక్టర్ డూమ్‌గా కనిపించనున్నారు. క్రిస్ ఎవాన్స్, క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్ తదితర భారీ తారాగణం కూడా ఇందులో భాగమైంది. రుస్సో బ్రదర్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ-సేల్స్ ఇప్పటికే 150 మిలియన్ డాలర్లను దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. డిసెంబర్ 17న భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అమెరికా కంటే ఒకరోజు ముందే ఇండియాలో రిలీజ్ అవుతుండటం మరో విశేషం. మరి ఈ క్రేజ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి...
