హైదరాబాద్: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భూముల ఈ-వేలానికి సంబంధించి ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం టీ-హబ్‌లో జరిగిన ఈ సమావేశంలో హెచ్ఎండీఏ అధికారులతో పాటు ఎంఎస్టీసీ, కేపీఎంజీ ప్రతినిధులు పాల్గొన్నారు. హుడా హైట్స్, నియోపోలిస్, మూసాపేట ప్రాంతాల్లోని భూముల వేలంపై ఆసక్తి చూపుతున్న బిడ్డర్లకు అధికారులు పలు వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయా భూములు ఉన్న ప్రాంతాలు, రవాణా కనెక్టివిటీ, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై కేపీఎంజీ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ-వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం, ఆన్‌లైన్ బిడ్డింగ్ ప్రక్రియ, నిబంధనలను ఎంఎస్టీసీ అధికారులు వివరించారు.
భూముల విస్తీర్ణం, ప్రాంతాల ప్రత్యేకతలు, మౌలిక సదుపాయాలు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) చెల్లింపులు, భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించిన నిబంధనలపై బిడ్డర్లు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు.
ఈ-వేలం షెడ్యూల్ ఇదే..
హెచ్ఎండీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 25న హుడా హైట్స్‌లోని 8 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
అలాగే నవంబర్ 27న నియోపోలిస్‌లోని 4.59 ఎకరాల భూమికి వేలం నిర్వహించనున్నారు. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బిడ్డింగ్ జరగనుంది.
మూసాపేటలోని 3.15 ఎకరాల భూమికి కూడా నవంబర్ 27నే ఈ-వేలం నిర్వహించనున్నారు. అయితే ఈ వేలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ ప్రీ-బిడ్ సమావేశంతో వేలంలో పాల్గొనాలనుకునే వారికి భూముల వివరాలు, బిడ్డింగ్ విధానం, చెల్లింపులు, నిబంధనలపై స్పష్టత లభించింది.
