చలికాలంలో జలుబు, ఇన్ఫెక్షన్ల భయం వేధిస్తోందా ? డాక్టర్ అవసరం లేకుండా ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి!

 చలికాలంలో జలుబు, ఇన్ఫెక్షన్ల భయం వేధిస్తోందా ? డాక్టర్ అవసరం లేకుండా  ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి!

చలికాలంలో వాతావరణం చల్లబడగానే హాయిగా అనిపించిన.. దానితో పాటే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లు కూడా తలుపు తడుతుంటాయి. కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా చలిగాలికి వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెంది మనల్ని మంచాన పడేస్తుంటాయి. అయితే, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ చలికాలంలో ఆసుపత్రుల చుట్టూ తిరిగే పనిలేకుండా, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ జలుబు, ఫ్లూల నుంచి రక్షణ పొందేందుకు నిపుణులు సూచిస్తున్న కొన్ని కీలకమైన ఆరోగ్య చిట్కాలు ఇవే...

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి: చలికాలంలో దాహం తక్కువగా అనిపిస్తుంది. కానీ, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. శ్లేష్మం (ఫ్యాట్/కఫం) పల్చబడటానికి, గొంతు ఉపశమనానికి రోజూ గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి. అలాగే  హెర్బల్ టీలు తీసుకుంటే గొంతుకు ఎంతో రిలీఫ్ లభిస్తుంది.

శరీరానికి తగినంత వెచ్చదనం : బయటకు వెళ్లేటప్పుడు శరీరానికి చలి తగలకుండా సరైన దుస్తులు ధరించాలి. ముఖ్యంగా ఛాతీ భాగం, పాదాలు, చెవులు కప్పి ఉంచేలా వెచ్చని దుస్తులు వేసుకోవడం వల్ల జలుబు వచ్చే అవకాశం తగ్గుతుంది.

తరచుగా చేతులు కడుక్కోవడం : వైరస్‌, బ్యాక్టీరియాల వ్యాప్తిని అరికట్టడానికి తరచుగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లి వచ్చాక లేదా ఏవైనా వస్తువులను తాకినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు మన శరీరంలోకి చేరకుండా నిరోధించవచ్చు.

స్టీమ్/హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి: చలికాలంలో గాలిలో తేమ తగ్గి చర్మం పొడిబారుతుంది. దీనికోసం రోజు తప్పకుండా ఆవిరి పట్టడం లేదా ఇంట్లో హ్యూమిడిఫైయర్ ఉపయోగించడం వల్ల నాసికా మార్గాలు తేమగా ఉండి, శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

నిద్రతో ఇమ్యూనిటీ: రోగనిరోధక శక్తి (Immunity) పెరగడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం 7 నుండి 9 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల శరీరం వేగంగా కోలుకోవడమే కాకుండా, వైరస్‌లతో పోరాడే శక్తి పెరుగుతుంది.

జలుబు, దగ్గు లేదా ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తులతో వీలైనంత వరకు సన్నిహితంగా ఉండకపోవడమే మంచిది. ఒకవేళ వారితో మాట్లాడాల్సి వస్తే మాస్క్ ధరించడం లేదా కొంత దూరం పాటించడం వల్ల వైరస్ సోకకుండా జాగ్రత్తపడవచ్చు. ఈ చిన్న జాగ్రత్తలను పాటిస్తే.. చలికాలాన్ని ఎలాంటి అనారోగ్యాలు లేకుండా హాయిగా, ఆరోగ్యకరంగా ఆస్వాదించవచ్చు.