కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పూర్వ విద్యార్థులు గురువుపై గురుభక్తిని చాటుకున్నారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా గురువుకు హై ఎండ్ కారును విద్యార్థులంతా కలిసి కానుకగా ఇచ్చారు. కరీంనగర్ DIETలో మహేశ్వర్ రెడ్డి ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశారు. 2014 నుంచి 2024 వరకు ఇంగ్లీష్ పాఠాలు బోధించారు. పూర్వ విద్యార్థులంతా కలిసి టాటా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసి ఆయనకు బహుమతిగా అందజేశారు.
గురువు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా సమావేశమైన పూర్వ విద్యార్థులు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కారును అందజేసిన అనంతరం విద్యార్థులు తమ గురువును వేదిక పైకి ఎత్తుకుని తీసుకెళ్లారు. విద్యార్థులు చూపిన ఆత్మీయతకు మహేశ్వర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కరతాళ ధ్వనుల మధ్య కొత్త కారులో గురువును పూర్వ విద్యార్థులు ఇంటికి సాగనంపారు. గురువు-శిష్యుల అనుబంధానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.
