హైదరాబాద్: తెలంగాణలో ఆటో ఛార్జీలను సవరిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీని 30 రూపాయలుగా నిర్ణయించింది. ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్‌కు 14 రూపాయలను ఛార్జీగా డిసైడ్ చేసింది. వెయిటింగ్ ఛార్జీలు నిమిషానికి ₹0.75 చొప్పున ఉంటాయి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రయాణాలకు సాధారణ ఛార్జీ కంటే 1.5 రెట్లు ఎక్కువ ఛార్జీ వర్తిస్తుంది.
2012 తర్వాత ఆటో చార్జీలు పెంచలేదని, కాబట్టి ఆటో చార్జీలు పెంచడానికి అంగీకరిస్తూ.. ఎంత పెంచాలనే అనే దానిపై తగిన నివేదిక తీసుకొని సంబంధిత జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఆటో కార్మికుల డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రకటించిన ప్రభుత్వం.. ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదని, అది దుష్ప్రచారం మాత్రమేనని ఆటో కార్మిక సంఘాలకు స్పష్టం చేసింది.
ఆటో డ్రైవర్ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల సమన్వయంతో ఆటో కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొత్త ఛార్జీలు:
* తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ ₹20 నుంచి ₹30కి
* ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు ₹11 నుంచి ₹14కి
* డిటెన్షన్ ఛార్జీ నిమిషానికి 50 పైసల నుంచి 75 పైసలకు
* అర్హత ఉన్న ప్రతి లగేజీ ప్యాకేజీకి ఛార్జీ 25 పైసల నుంచి 50 పైసలకు
* గరిష్ఠ లగేజీ పరిమితి 100 కిలోలు గానే కొనసాగింపు
* రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 1.5 రెట్లు ఛార్జీ యథాతథం
* ప్రస్తుత ఛార్జీలు 2014 ఫిబ్రవరి 14న జారీ చేసిన G.O.Ms.No.20 ప్రకారం అమల్లో ఉన్నాయి
* అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలే తెలంగాణలోనూ కొనసాగుతున్నాయి
* దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆటో ఛార్జీల సవరణ జరిగింది
* మీటర్ల రీసెట్టింగ్‌కు 3 నెలల గడువు
* అప్పటివరకు ఆటోల్లో పాత, కొత్త ఛార్జీల టారిఫ్ కార్డు తప్పనిసరి
* 2014 తర్వాత తొలిసారిగా ఆటో ఛార్జీల సవరణ
* ఇంధనం, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ ఖర్చుల పెరుగుదల దృష్ట్యా నిర్ణయం
* ఆటో డ్రైవర్ల జీవనోపాధి, ప్రయాణికుల భారం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం
