ఎల్కతుర్తి, వెలుగు: చిట్టీల వ్యాపారం పేరుతో డబ్బులు వసూలు చేసిన ఓ వ్యాపారి కుటుంబంతో సహా కనిపించకుండా పోయిన ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో శుక్రవారం వెలుగుచూసింది. భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చెందిన దూడల శ్రీధర్.. ఎల్కతుర్తికి చెందిన యువతిని 17 ఏండ్ల కింద పెండ్లి చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు.
చిట్టీలు నిర్వహించడంతో పాటు డబ్బులను వడ్డీకి తీసుకుని క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించేవాడని బాధితులు తెలిపారు. వందలాది మంది అతడి వద్ద చిట్టీలు వేశారు. నాలుగు రోజులుగా శ్రీధర్ కనిపించకపోవడంతోపాటు ఫోన్ స్విచాఫ్ వస్తోంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో కుటుంబంతో సహా పరారైనట్లు బాధితులు అనుమానిస్తున్నారు. రూ.5 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
