పాకిస్థాన్‌తో గోల్డ్ కోసం ఫైట్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్

పాకిస్థాన్‌తో గోల్డ్ కోసం ఫైట్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్

India vs Pakistan: జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మెన్స్ క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌ (Gold Medal Match) సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే జరిగిన టాస్ ప్రక్రియలో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇక టాస్ సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల జట్ల కెప్టెన్లు కరచలనం (Handshake) చేసుకోకపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.

కోరోగి స్పోర్ట్స్ పార్క్‌లో హై-వోల్టేజ్ పోరు: 

జపాన్‌లోని నిస్షిన్ నగరంలో ఉన్న కోరోగి స్పోర్ట్స్ పార్క్ (Korogi Sports Park) వేదికగా ఈ చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో పురుషుల క్రికెట్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడటం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న క్రీడా వైరం కారణంగా ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), పాకిస్థాన్ skipper సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) టాస్ కోసం మైదానంలోకి వచ్చారు. కానీ, సాంప్రదాయకంగా జరిగే షేక్ హ్యాండ్ (Handshake) ఈసారీ కూడా జరగలేదు. ఇటీవల కాలంలో టీమిండియా వర్సెస్ పాక్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లలో ఈ ఆచారానికి స్వస్తి పలికిన విషయం అందరికీ తెలిసిందే. కేవలం క్రికెట్‌లోనే కాకుండా ఇతర క్రీడా వేదికలపై కూడా ఇరు దేశాల అథ్లెట్ల మధ్య ఈ పద్ధతే కొనసాగుతుండటం గమనార్హం.

స్వర్ణం కోసం నువ్వా-నేనా?: 

2023 చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు, ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి మరోసారి గోల్డ్ మెడల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, పాకిస్థాన్ మాత్రం ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా స్వర్ణం గెలవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో పిచ్ పరిస్థితులు మ్యాచ్ ఫలితాన్ని శాసించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.