ఏఐ భర్తీ చేయలేని ఉద్యోగాలు.. ఆటోమేషన్ సాధ్యం కాని పనులు ఇవే.. AI ని బీట్ చేసేది వీళ్లే అంటున్న ఫోర్డ్ సీఈఓ

 ఏఐ భర్తీ చేయలేని ఉద్యోగాలు.. ఆటోమేషన్ సాధ్యం కాని పనులు ఇవే.. AI ని బీట్ చేసేది వీళ్లే అంటున్న ఫోర్డ్ సీఈఓ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జాబ్ మార్కెట్ రిస్కులో పడిన తరుణంలో..  ఫోర్డ్ మోటార్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.  ఏఐ ని బీట్ చేస్తూ ముందుకు సాగాలంటే ఏం చేయాలో చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భర్తీ చేయగల ఉద్యోగాలు, చేయలేని ఉద్యోగాల మధ్య స్పష్టమైన తేడాను వివరించారు. ఫోర్డ్ ప్రో యాక్సిలరేట్ కార్యక్రమంలో మీడియా రౌండ్‌టేబుల్‌లో మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన ట్రేడ్స్ వర్కర్స్ మాత్రమే మొదటి దశ ఏఐ విప్లవం నుంచి బయటపడతారని అన్నారు. 

ఏఐని తెలివిగా వాడుకునే వాళ్లదే ఈ యుగం అని అన్నారు. అదే సమయంలో ఏఐతో సంబంధంలేని స్కిల్స్ కలిగిన వాళ్లు లీడ్ చేస్తారని చెప్పారు. ఏఐ ఫ్యాక్టరీలు, రిపేర్ షాపులు, నైపుణ్యం కలిగిన వృత్తుల్లో పనిచేసే వారికి ఏఐ కంపానియన్ గా పనిచేస్తుంది తప్ప వారిని భర్తీ చేయదని ఆయన స్పష్టం చేశారు.

అయితే రొటీన్ వైట్-కాలర్ ఉద్యోగాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించారు. మీరు ఫైనాన్స్‌లో స్ప్రెడ్‌షీట్లు చేస్తుంటే, కాల్ సెంటర్‌లో పనిచేస్తుంటే లేదా ఎంట్రీ-లెవల్ ప్రోగ్రామర్ అయితే.. ఆ ఉద్యోగాలు ఏఐ మొదటి దశలోనే మారిపోతాయి లేదా పోతాయి అని ఫార్లీ అన్నారు.

ప్రాక్టికల్ జడ్జిమెంట్ ను ఏఐ ఆటోమేషన్ చేయలేదు:

చేతితో చేసే సమస్య పరిష్కారం, ఫిజికల్ స్కిల్స్, వాస్తవ అనుభవాల ఆధారంగా ఇచ్చే పరిష్కారాన్ని , అవసరమైన ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయలేదని ఫార్లీ అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు, మెకానిక్స్, ఫ్యాక్టరీ స్కిల్డ్-ట్రేడ్స్ వర్కర్స్ కొనసాగుతారు. వీరు ఏఐ ఆధారిత సిస్టమ్స్, రోబోట్లు, ఆటోమేషన్ టూల్స్‌తో కలిసి పనిచేస్తారు. కానీ లోపాలను గుర్తించడం, ఆచరణాత్మక జ్ఞానం వర్తింపజేయడం, భద్రతను నిర్ధారించడం మాత్రం మనుషులే చేస్తారని అన్నారు. 

►ALSO READ | AI చిప్స్ కోసం ఎన్వీడియా ట్రక్స్ ఎత్తుకెళ్లిన దొంగలు.. తెరిచి చూసి షాకయ్యారు!

ఫోర్డ్‌లో ఇప్పటికే ఈ మార్పు కనిపిస్తోంది. కంపెనీలో 10,000కు పైగా స్కిల్డ్-ట్రేడ్స్ వర్కర్స్ ఉన్నారు. ఇది యూఏడబ్ల్యూ ప్రాతినిధ్యం వహించే 56,000 మంది కార్మికుల్లో సుమారు 20 శాతం. ఇప్పుడు వీరు సాంప్రదాయ మెకానికల్ పరికరాల నిర్వహణ కంటే రోబోట్లు, ఆటోమేటెడ్ ప్రొడక్షన్ సిస్టమ్స్, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.

ఇంజనీర్, టెక్నీషియన్ మధ్య గ్యాప్ తగ్గుతోంది

ఆధునిక ఫ్యాక్టరీల్లో ఇంజనీరింగ్, స్కిల్డ్ ట్రేడ్స్ మధ్య తేడా తగ్గుతోందని ఫార్లీ చెప్పారు. ఇంజనీర్ లేదా మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్ ఎక్కడ ఆగుతాడో, స్కిల్డ్ ట్రేడ్ ఎక్కడ మొదలవుతుందో చెప్పడం కష్టం అని అన్నారు. కొత్త ఫోర్డ్ ప్లాంట్లలో స్కిల్డ్-ట్రేడ్స్ ఉద్యోగులు రోబోటిక్ కాస్టింగ్ సిస్టమ్స్, బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ పరికరాలు, డిజిటల్ ప్రొడక్షన్ ప్రాసెస్‌లను నిర్వహిస్తున్నారు. కొన్ని పనులు సెమీకండక్టర్ ఫ్యాక్టరీల్లో జరిగే పనులను పోలి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

విశ్వాసం కీలకం

ఏఐ వల్ల కలిగే ఆందోళన పాతకాలం నాటి టైమ్-అండ్-మోషన్ స్టడీస్‌కు సమానమని ఫార్లీ చెప్పారు. టెక్నాలజీని విజయవంతంగా అమలు చేయాలంటే కార్మికుల్లో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరంఉందన్నారు.