ఐటీ ఉద్యోగులకు విప్రో శుభవార్త: బెంచ్ టైం పెంచుతూ కొత్త రూల్స్

ఐటీ ఉద్యోగులకు విప్రో శుభవార్త: బెంచ్ టైం పెంచుతూ కొత్త రూల్స్

ఏఐ దెబ్బతో ప్రస్తుతం ఐటీ రంగంలో ప్రతికూల పరిస్థితులు, కఠిన నిబంధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇతర ఐటీ కంపెనీలు బెంచ్ టైమ్‌ను విపరీతంగా కుదించి ఉద్యోగులపై కత్తి నూపుతుంటే.. విప్రో మాత్రం ఇందుకు భిన్నంగా తన బెంచ్ పాలసీని మరింత విస్తరించింది. జూనియర్ నుంచి మిడ్-లెవెల్ ఉద్యోగుల కోసం బెంచ్ సమయాన్ని ఏకంగా 6 నెలల వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పాలసీతో ఉద్యోగులు మరింత ప్రశాంతంగా కొత్త ప్రాజెక్ట్‌లను వెతుక్కునే అవకాశం లభించినట్లయింది.

కొత్త బెంచ్ పాలసీ వివరాలు ఇవే..
విప్రోలోని బ్యాండ్ 2 అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులకు ఈ కొత్త వెసులుబాటు వర్తిస్తుంది. ఏదైనా బిల్టబుల్ ప్రాజెక్ట్ నుంచి ఉద్యోగి రిలీజ్ అయిన రోజు నుంచి లేదా ఆన్‌సైట్ అసైన్‌మెంట్ ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చినప్పటి నుంచి 180 రోజుల గడువు లెక్కించబడుతుంది బెంచ్ పాలసీ కింద. ప్రాజెక్ట్ కేటాయించకపోతే 6 నెలల కాలంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కంపెనీ అవకాశం కల్పిస్తుంది. అయితే 180 రోజుల్లోపు కూడా ఎలాంటి ప్రాజెక్ట్ దక్కకపోతేనే ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉంటుందని పాలసీ స్పష్టం చేస్తోంది. గతంలో కొత్త ఫ్రెషర్ల నియామకాలు తగ్గడంతో.. ఉన్న ఉద్యోగులను సరైన ప్రాజెక్ట్‌లకు రీ-డిప్లాయ్ చేయడానికి ఈ పొడిగించిన బెంచ్ పీరియడ్ కంపెనీకి కూడా సహాయపడుతుందని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.

ఇతర ఐటీ కంపెనీల రూల్స్..
ఇతర పెద్ద ఐటీ సంస్థలు మాత్రం బెంచ్ సమయాలను విపరీతంగా తగ్గించేశాయి. సాధారణంగా 45 నుంచి 60 రోజులు ఉండే బెంచ్ కాలాన్ని కొన్ని కంపెనీలు కేవలం 35 రోజులకు కుదించాయి. ఉదాహరణకు.. టీసీఎస్ తన అసోసియేట్ డిప్లాయ్‌మెంట్ పాలసీని మారుస్తూ.. ఏడాదిలో 225 రోజులు బిల్లబుల్ అయి ఉండాలని నిబంధన పెట్టింది. దీనివల్ల ఉద్యోగులకు ఏడాదిలో కేవలం 35 రోజులు మాత్రమే బెంచ్ సమయం దక్కుతుంది. కాగ్నిజెంట్ కూడా ఆరేళ్ల క్రితమే బెంచ్ కాలాన్ని 60 రోజుల నుంచి 35 రోజులకు తగ్గించింది. ఇలాంటి సమయంలో విప్రో తన ఉద్యోగులకు 180 రోజుల సమయం ఇవ్వడం బిగ్ రిలీఫ్.

విప్రో అమలు చేస్తున్న 'ఎక్స్‌టెండెడ్ బెంచ్ లీవ్ ప్రోగ్రామ్' పై కొందరు మాజీ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. ప్రాజెక్ట్ లేని సమయంలో తొలి 45 రోజులు పెయిడ్ బెంచ్ ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ఈ EBLP కింద ఉద్యోగులను 90 రోజుల పాటు అన్‌పెయిడ్ బెంచ్‌లో ఉంచుతున్నారని, ఆ సమయంలో జీతాలు, పీఎఫ్ కంట్రిబ్యూషన్స్ నిలిచిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రాజెక్ట్ దొరికితేనే మళ్లీ జీతం వస్తుందని, లేకపోతే రాజీనామా చేయాల్సి వస్తోందని వాపోయారు. మెుత్తానికి ఏఐ యుగంలో 6 నెలల బెంచ్ టైం ఇవ్వటం అంటే గ్రేట్ అనే చెప్పుకోవాలని టెక్కీలు అంటున్నారు.