నేడే భారత్ vs వెస్టిండీస్ మూడో వన్డే: పిచ్ బ్యాటర్లకా.. బౌలర్లకా? వెదర్ రిపోర్ట్ ఇదిగో!

నేడే భారత్ vs వెస్టిండీస్ మూడో వన్డే: పిచ్ బ్యాటర్లకా.. బౌలర్లకా? వెదర్ రిపోర్ట్ ఇదిగో!

IND vs WI 3rd ODI: న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదింద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ముల్లన్‌పూర్ స్టేడియం) చరిత్రలో తొలిసారిగా ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించి 2–0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా, ఇప్పుడు వెస్టిండీస్‌పై క్లీన్‌స్వీప్ (3–0) లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.  గౌహతి వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో బౌలర్లకు ఎలాంటి సహకారం లభించలేదనే విమర్శలు రావడంతో, ఇప్పుడు అందరి దృష్టి కొత్తగా రూపుదిద్దుకున్న ముల్లన్‌పూర్ స్టేడియం పిచ్‌పై పడింది. ఈ నేపధ్యంలో నేడు (అక్టోబర్ 3, 2026, శనివారం) జరగనున్న మూడో వన్డేకు సంబంధించిన పిచ్ రిపోర్ట్,  వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం.   

ముల్లన్‌పూర్ స్టేడియం పిచ్ రిపోర్ట్: 

ముల్లన్‌పూర్ స్టేడియం ఇప్పటివరకు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేదు. అయితే ఇక్కడ గతంలో జరిగిన రెండు మహిళల వన్డేల గణాంకాలను బట్టి చూస్తే, ఇది పూర్తిగా హై-స్కోరింగ్ వేదికగా కనిపిస్తోంది. బ్యాట్‌‌పైకి బంతి చక్కగా రావడంతో బ్యాటర్లు పరుగుల వరద పారించే అవకాశం ఉంది. కొత్త బంతితో పేసర్లకు కొద్దిగా సీమ్ మూమెంట్ లభించినప్పటికీ, ఆ తర్వాత బౌలర్లు కష్టపడక తప్పదు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో మంచు (Dew) కీలక పాత్ర పోషించనుంది. ఈ కారణంగా టాస్ గెలిచిన జట్లు ఛేజింగ్ (ఫీల్డింగ్) తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు.   

ముల్లన్‌పూర్ స్టేడియంలో ఆడిన మ్యాచులు: 

* ఆడిన మ్యాచ్‌లు: 2

* మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచినవి: 1

* ఛేజింగ్ చేసిన జట్లు గెలిచినవి: 1

* సగటు రన్ రేట్: 5.64

* మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు: 286.5 పరుగులు

 
న్యూ చండీగఢ్ వాతావరణ నివేదిక: 

అక్యువెదర్ అంచనా ప్రకారం నేడు (అక్టోబర్ 3, 2026, శనివారం)  న్యూ చండీగఢ్‌లో ఎండ్‌తో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం (Weather Update) ఉండనుంది. వర్షం ముప్పు అసలు లేదు. కానీ పగటిపూట ఉష్ణోగ్రత 35°C వరకు ఉంటుంది, సూర్యాస్తమయం తర్వాత ఉష్ణోగ్రత 22°Cకి పడిపోనుంది. ఇది ఫీల్డర్లు, బ్యాటర్లకు ఎంతో ఊరటనిస్తుంది. వర్షం ముప్పు లేకపోవడంతో అభిమానులకు అసలైన పరుగుల విందు దక్కడం ఖాయం. మంచు ప్రభావం ఉండనుండటంతో టాస్ నెగ్గిన కెప్టెన్లు తొలుత బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే, సొంత గడ్డపై భారత జట్టు వైట్‌వాప్ ముద్ర వేయాలని చూస్తుంటే, పరువు నిలుపుకోవాలని విండీస్ పట్టుదలగా ఉంది. 

* ఉష్ణోగ్రత: గరిష్టంగా 35°C వరకు ఉంటుంది.

* గాలి వేగం: పశ్చిమ దిశగా గంటకు 13 కి.మీ వేగంతో వీస్తుంది.

* మేఘావృతం (Cloud cover): 0%

* వర్షం పడే అవకాశం: 0%