- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, వెలుగు : అంగన్‌వాడీ సెంటర్లను పిల్లలకు భోజనం పెట్టే కేంద్రాలుగానే పరిమితం చేయకుండా ఆరోగ్యం, ప్రీ-స్కూల్ విద్య, డిజిటల్ మానిటరింగ్ వంటి సౌకర్యాలను కేంద్రం కల్పిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా 2 లక్షల అంగన్‌వాడీలను 'సాక్షమ్ అంగన్‌వాడీ'లుగా ఆధునికీకరించే కార్యక్రమం చేపట్టినట్లు ప్రకటించారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ లోని తీగలగుట్టపల్లిలో 'అంగన్ మిలన్ సేవా' కార్యక్రమం నిర్వహించారు.
ఈ ప్రోగ్రామ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు నిర్మలారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారాన్ని పరిశీలించి, స్టాల్ ను సందర్శించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ప్రస్తుతం రెండు లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను దశల వారీగా సాక్షం అంగన్ వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసి వైఫై, ఎల్ఈడీ స్ర్కీన్లు, ఆర్వో ప్లాంట్లు, స్మార్ట్ లెర్నింగ్ వంటి సదుపాయాలను కల్పించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
అంతకుముందు చంద్రపురి కాలనీలో డ్రైన్ పైప్ లైన్, సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎంపీపీఎస్, జడ్పీ హైస్కూల్ లో రూ.1.05 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనులను ప్రారంభించారు.
అమిత్ షా పర్యటన ఏర్పాట్ల పరిశీలన
కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభించి 25 ఏండ్లు పూర్తైన సందర్బంగా ఈ నెల 4న సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరై, ప్రతిమ డీమ్డ్ యూనివర్శిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం మధ్యాహ్నం ప్రతిమ కాలేజీకి వచ్చారు.
సీపీ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, ప్రతిమ కాలేజీ చైర్మన్ బోయినిపల్లి శ్రీనివాసరావు, చెన్నమనేని వికాస్ రావు, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి కాలేజీకి చేరుకున్నారు. హెలిప్యాడ్ తో పాటు డీమ్డ్ వర్సిటీ పైలాన్ స్టోన్, ఫొటో ఎగ్జిబిషన్ పరిసరాలు, సభా స్థలాన్ని పరిశీలించారు.
అమిత్ షా ఈ నెల 3న రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని, రాత్రి గ్రాండ్ కాకతీయ హోటల్ లో బస చేయనున్నట్లు బండి సంజయ్ చెప్పారు. 4న ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో మెదక్ జిల్లా తూప్రాన్ కు చేరుకొని సబర్ డెయిరీ ప్రొడక్ట్స్ మిల్క్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్ లో లంచ్ చేయనున్నట్లు చెప్పారు.
మధ్యాహ్నం 2 గంటలకు తూప్రాన్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కళాశాల వద్దకు చేరుకొని సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారని ప్రకటించారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయలుదేరనున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.
