ఈ పండగ సీజన్‌లో కొత్త ఆటోమేటిక్ కారు కొనాలని చూస్తున్నారా ? అయితే మీకోసం అక్టోబర్‌లో చాల కొత్త మోడళ్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. విశేషమేమిటంటే, ఈ రాబోయే కార్లన్నీ ఒకే రకమైన ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రావడం లేదు. కొన్ని కార్లు CVT గేర్‌బాక్స్‌తో వస్తుంటే... మరికొన్ని డ్యూయల్-క్లచ్ (DSG) లేదా టార్క్-కన్వర్టర్ యూనిట్లతో వస్తున్నాయి. అయితే అక్టోబర్‌లో లాంచ్ కాబోతున్న ఆటోమేటిక్ కార్లు ఏంటో చూద్దామా....
1. స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్
ఆటోమేటిక్ కార్లను ఇష్టపడే వారి కోసం స్కోడా ఒక మంచి అప్‌గ్రేడ్ తీసుకొచ్చింది. 1.0-లీటర్ ఇంజన్‌లో ఇప్పటివరకు ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో, ఇప్పుడు కొత్త 8-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించనున్నారు. మరో ఆప్షన్ 1.5-లీటర్ ఇంజన్ మాత్రం ఇంతకుముందులాగే 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తోనే వస్తుంది. దీని ధర రూ. 11 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు ఉండొచ్చు.
2. హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్
అప్‌డేటెడ్ హోండా ఎలివేట్ 2026 అక్టోబర్ 6న విడుదల కానుంది. ఎక్స్టీరియర్ డిజైన్, ఫీచర్ల పరంగా చాల మార్పులు ఉంటాయి కానీ, ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. దీని అంచనా ధర రూ. 11 లక్షల నుండి రూ. 17 లక్షల వరకు ఉంటుంది.
3. హ్యుందాయ్ బయోన్
ఈ కొత్త మైక్రో SUV పండగ సీజన్ కానుకగా భారత మార్కెట్లోకి వస్తోంది. ఈ కార్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. దీనికి మాన్యువల్‌తో పాటు CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది. ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉండవచ్చని సమాచారం. దీని అంచనా ధర సుమారు రూ. 9 లక్షల నుండి ప్రారంభం కావచ్చు. అయితే బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
4. ఆడి క్యూ3 (Audi Q3)
ప్రీమియం లేదా లగ్జరీ ఆటోమేటిక్ కారు కొనాలనుకునే వారి కోసం ఆడి కంపెనీ కొత్త Q3 ని అక్టోబర్ 16న లాంచ్ చేస్తోంది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇంకా ఆల్-వీల్ డ్రైవ్ (Quattro) సిస్టమ్‌తో వస్తుంది. దీని అంచనా ధర రూ. 55 లక్షల నుండి రూ. 60 లక్షల వరకు ఉండొచ్చు.
5. రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ (Renault Duster Hybrid)
రెనాల్ట్ ఐకానిక్ డస్టర్ SUV హైబ్రిడ్ వెర్షన్‌ను అక్టోబర్ 17న విడుదల చేయనుంది. 1.8-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఇంకా 1.4kWh బ్యాటరీ హైబ్రిడ్ సిస్టమ్ ఉంది. ఈ హైబ్రిడ్ సిస్టమ్ 160bhp, 172Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ చూస్తే ప్రత్యేకమైన 8-స్పీడ్ హైబ్రిడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇందులో ఉంది. దీని ప్రత్యేకత సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు దాదాపు 80% ప్రయాణాన్ని కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే చేయవచ్చని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.19 లక్షల నుండి ప్రారంభం కావచ్చు.
