కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ప్రవేశపెట్టిన ఛార్జీలను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నో యూపీఐ డే కి పిలుపునిచ్చిన వ్యాపార సంఘాలు అనూహ్యంగా కొన్ని గంటల ముందు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయ్. దీంతో ప్రజలు కొత్త నెల ప్రారంభంలో తమ కిరాణా, షాపింగ్, ఇతర చెల్లింపుల కోసం ఎలాంటి ఇబ్బంది పడనక్కర్లేదు. కంగారు పడి ఏటీఎంలు, బ్యాంకుల వద్దకు వెళ్లి క్యాష్ విత్ డ్రా చేసుకోనవసరం లేదు. యూపీఐ చెల్లింపులపై నిరసన కార్యక్రమాన్ని వ్యాపార సంఘాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన సమావేశం తర్వాత ఉపసంహరించుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశం సానుకూలంగా జరగడంతో ఆల్ ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఇచ్చిన బంద్ పిలుపును వెనక్కి తీసుకున్నాయి. అయితే రూ.2వేలకు పైన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలతో చిన్న, మధ్యతరహా వ్యాపారాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ట్రేడర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న పండుగ సీజన్, వ్యాపార కార్యకలాపాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఛార్జీల అమలును వాయిదా వేయాలని మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే నెలకు రూ.లక్ష పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని, వ్యాపారుల మధ్య జరిగే మర్చంట్-టు-మర్చంట్(M2M) లావాదేవీలపై యూపీఐ ఎండీఆర్ ఛార్జీల పరిధి నుంచి మినహాయించాలని వారు కోరారు.
వ్యాపారుల సమస్యలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ట్రేడర్స్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. డిజిటల్ చెల్లింపుల ఊపందుకునేలా చూస్తూనే.. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు సీఐటీఒక ప్రకటనలో వెల్లడించింది. డిజిటల్ ఇండియా మిషన్‌కు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూపీఐ విజయానికి తమ పూర్తి సపోర్ట్ ఉంటుందని ట్రేడ్ యూనియన్ నేతలు అన్నారు.
ALSO READ : హైదరాబాద్ లోని కాస్మెటిక్ షాపుల్లో మేడ్ ఇన్ పాకిస్థాన్ ప్రాడక్ట్స్...
డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన విధానాలు వినియోగదారులు, వ్యాపారాల వృద్ధికి సమతుల్యంగా ఉండాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం, వ్యాపార సంఘాల మధ్య జరిగే నిరంతర చర్చల ద్వారా దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సరైన విధివిధానాలు రూపుదిద్దుకుంటాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
