- గతేడాది తొలి అర్ధ సంవత్సరంలో 287.6 లక్షల టన్నుల సరఫరా
- సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి
హైదరాబాద్, వెలుగు : బొగ్గు రవాణాలో సింగరేణి సంస్థ గతేడాదితో పోలిస్తే నాలుగు శాతం వృద్ధి సాధించిందని ఆ సంస్థ సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి చెప్పారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో గురువారం మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థ బొగ్గు రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపులో సెప్టెంబర్ 30 నాటికి ఆర్థిక తొలి అర్ధ సంవత్సరంలో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు.
గతేడాది 287.6 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా.. ఈ సారి 299.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసిందని చెప్పారు. తెలంగాణ జెన్కో కు గతేడాది159.1 లక్షల టన్నుల రవాణా చేయగా ఈ సారి రాష్ట్ర అవసరాలకు పెద్దపీట వేస్తూ 198.2 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేశామన్నారు. గతేడాదితో పోల్చి చూస్తే 24.58 శాతం ఎక్కువ బొగ్గును జెన్కో కు అందించామన్నారు.
కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాది 39.8 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయగా.. యాదాద్రి ప్లాంట్‌కు 33.9 లక్షల టన్నులు సరఫరా చేసినట్లు ప్రకటించారు. అలాగే మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు 24.4 లక్షల టన్నులు, సింగరేణి విద్యుత్ కేంద్రానికి 26.6 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేశామన్నారు.
ఎన్ టీపీసీ తెలంగాణ ప్లాంట్ కు గతేడాది 19.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా.. ఈ సారి 25.3 లక్షల టన్నులు, రామగుండం ప్లాంట్ కు పోయినేడాది 43.5 లక్షల టన్నులు సరఫరా చేయగా.. ఈ ఏడాది 42.7 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేశామని తెలిపారు.
