- నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్లతో ఇన్సూరెన్స్ క్లెయిమ్
- నలుగురు నిందితులు అరెస్టు
మహబూబాబాద్(వరంగల్), వెలుగు: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో భారీ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎంపీవో కార్యాలయ సిబ్బంది, బయ్యారం సీఐ రవీందర్ కథనం ప్రకారం.. బయ్యారం ఎంపీవో కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి, స్థానిక మీ-సేవ కేంద్రం నిర్వాహకుడు, జిల్లా కేంద్రానికి చెందిన మరో ఇద్దరు కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
వీరు 275 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, 19 నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేశారు. కమీషన్ తీసుకుని ఈ సర్టిఫికెట్ల ద్వారా తప్పుడు మార్గంలో బీమా క్లెయిమ్‌లు చేసేవారితో కుమ్మక్కైనట్లు తెలుస్తోంది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఇతర రాష్ట్రాల్లో వివిధ కేసుల్లో కోట్లాది రూపాయల దందాకు పాల్పడినట్లు సమాచారం. నకిలీ సర్టిఫికెట్ల బాగోతం కొన్నిరోజుల క్రితమే వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బయ్యారం పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరికొందరిని విచారిస్తామని సీఐ రవీందర్ తెలిపారు.
