ఇషాన్‌‌.. మెరిసెన్‌‌.. ఏషియాడ్ క్రికెట్ ఫైనల్లో ఇండియా..

ఇషాన్‌‌.. మెరిసెన్‌‌.. ఏషియాడ్ క్రికెట్ ఫైనల్లో ఇండియా..
  • సెమీస్‌‌లో 124 రన్స్‌‌ తేడాతో లంకపై గెలుపు

నిస్సిన్‌‌: బ్యాటింగ్‌‌లో ఇషాన్‌‌ కిషన్‌‌ (46 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 80 నాటౌట్‌‌) ధనాధన్‌‌ షాట్లతో రెచ్చిపోవడంతో.. ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 124 రన్స్‌‌ తేడాతో శ్రీలంకపై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. టాస్‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 169/7 స్కోరు చేసింది. ఓపెనింగ్‌‌లో వైభవ్‌‌ సూర్యవంశీ (21 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 38) వేగంగా ఆడినా.. రెండో ఎండ్‌‌లో అభిషేక్‌‌ శర్మ (7), సంజూ శాంసన్‌‌ (7) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.

అప్పటివరకు భారీ షాట్లు ఆడిన వైభవ్‌‌ కూడా ఏడో ఓవర్‌‌లో వెనుదిరగడంతో ఇండియా 59/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (13)తో కలిసి ఇషాన్‌‌ ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. నాలుగో వికెట్‌‌కు 28 రన్స్‌‌ జోడించి శ్రేయస్‌‌ ఔటైనా.. ఇషాన్‌‌ చివరి వరకు క్రీజులో నిలిచాడు. అక్షర్‌‌ పటేల్‌‌ (8), తిలక్‌‌ వర్మ (2), శివమ్‌‌ దూబే (3), వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (7) ఫెయిలయ్యారు. తరిందు రత్నాయకే, సహాన్‌‌ అచ్చిరాగే చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌లో లంక 9.5 ఓవర్లలోనే 45 రన్స్‌‌కు ఆలౌటైంది. టెస్ట్‌‌లు ఆడే దేశం చేసిన అత్యల్ప టీ20 ఇంటర్నేషనల్‌‌ స్కోర్లలో ఇది ఒకటి.

2019లో ఇంగ్లండ్‌‌పై విండీస్‌‌ ఇదే స్కోరుకు ఆలౌటైంది. నువానింద్‌‌ ఫెర్నాండో (15) టాప్‌‌ స్కోరర్‌‌. బుమ్రా (2/7), అక్షర్‌‌ పటేల్‌‌ (2/8), అభిషేక్‌‌ శర్మ (2/2) కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో లంక బ్యాటర్లు విలవిలలాడారు. దాంతో పవర్‌‌ప్లేలోనే 31/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌‌లో పది మంది సింగిల్‌‌ డిజిట్‌‌కే ఔట్‌‌ కాగా అందులో ఆరుగురు సున్నాకే వెనుదిరిగారు. శనివారం జరిగే స్వర్ణ పతక పోరులో ఇండియా.. పాకిస్తాన్‌‌తో తలపడుతుంది.