- వర్సిటీలు, రీసెర్చ్ సంస్థల అనుసంధానమే లక్ష్యం
- టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్‌మెంట్ కాన్‌క్లేవ్(రీచ్ –2026) సదస్సును నిర్వహించనున్నట్టు టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. జేఎన్‌టీయూహెచ్‌లో శనివారం ఉదయం ఈ సదస్సు ప్రారంభం కానున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులతో కలిసి బాలకిష్టారెడ్డి.. రీచ్ ప్రోగ్రామ్ వివరాలను వెల్లడించారు.
రీచ్ సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్ బాబు, అతిథిగా సైయంట్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ మీటింగ్‌కు 35 సర్కారు, ప్రైవేటు యూనివర్సిటీల వీసీలు, మరో 30 రీసెర్చ్ సంస్థలకు చెందిన ప్రతినిధులు అటెండ్ కానున్నారని తెలిపారు. దీనిలో ప్రధానంగా మూడు కీలక అంశాలు ‘గ్లోబల్ పోటీతత్వమే లక్ష్యంగా ఉన్నత విద్యలో మార్పులు’ , ‘పరిశోధనా శ్రేష్టత, సహకారం, ఆవిష్కరణలు’ , ‘పరిశోధన నుంచి ఎంటర్‌ప్రైజ్ వైపు’అనే అంశాలపై చర్చించనున్నట్టు వివరించారు.
భవిష్యత్ ప్రణాళికలపై చర్చిస్తాం
సదస్సులో భాగంగా విద్యా, పరిశోధనా సంస్థలు సమర్పించిన ‘ఇన్‌స్టిట్యూషనల్ విజన్ డాక్యుమెంట్స్’ (9 కీలక రంగాలు) ఆధారంగా భవిష్యత్ ప్రణాళికలపై చర్చిస్తామని బాలకిష్టారెడ్డి వెల్లడించారు. అమలు చేయదగిన ఉమ్మడి ప్రాజెక్టులు, విద్యాసంస్థలు,- పరిశ్రమల మధ్య బలమైన కొలాబరేషన్స్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌పై స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
హైదరాబాద్ ప్రస్తుతం టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగిందన్నారు. ఈ పారిశ్రామిక, విద్యా అనుసంధాన స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలా ‘రీచ్-2026’ను ఒక నిరంతర వేదికగా మారుస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు. శనివారం జరగనున్న ఈ సదస్సుకు వివిధ వర్సిటీల వీసీలు, సైంటిస్టులు, పారిశ్రామిక వేత్తలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
