హైదరాబాద్: పాతబస్తీలో చారిత్రక బావిని కాపాడే పనులను హైడ్రా ముమ్మరం చేసింది. నిజాం పాలకులు నీళ్లు తాగిన చారిత్రక బావి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు దగ్గర ఉన్న ఊట బావి పునరుద్ధరణ పనులను హైడ్రా వేగవంతం చేసింది. 1.50 ఎకరాల విస్తీర్ణంలో చారిత్రక బౌలి పునరుద్ధరణ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు, మూడు నెలల్లో బావి పునరుద్ధరణ పనులు పూర్తి చేసేలా హైడ్రా స్పీడ్ పెంచింది.
బావిలోకి పుష్కలంగా నీరు వచ్చేలా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో బావి పునరుద్ధరణకు అడుగులు పడ్డాయి. మార్చి 8న బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. చెరువు పక్కనే ఉన్న చారిత్రక బావి అంశాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. చెరువు అభివృద్ధి చేసిన విమోస్ టెక్నోక్రాట్స్ సంస్థకే బావి పునరుద్ధరణ బాధ్యతలు అప్పగించారు.
ప్లాస్టిక్, చెత్త, మట్టి, స్లష్ను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. దట్టమైన పిచ్చి మొక్కలను తొలగించి బావికి పునరుజ్జీవనం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని తిరిగి తీసుకురావడమే హైడ్రా లక్ష్యంగా పెట్టుకుంది. ఒకప్పుడు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు.. ఆక్రమణలతో చివరకు 4 ఎకరాలకు పరిమితమైంది. hmda లెక్కల ప్రకారం 17 ఎకరాల మేర చెరువు విస్తీర్ణం ఉండగా, ఆక్రమణలు తొలగించి చెరువుకు హైడ్రా పునరుజ్జీవం కల్పించింది.
