ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం రేపింది. గురువారం ఓయూలోని ఎన్ఆర్ఎస్  హాస్టల్  నుంచి హబ్సిగూడ వెళ్లే రూట్​లో ఈ మొక్క ఒకరికి కనబడడంతో వారు మీడియాకు సమాచారం అందించారు. దీంతో మీడియా ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరిటీ, ఓయూ పోలీసులు మొక్క ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు.

విద్యార్థులు చదువుకునే క్యాంపస్‌‌లో గంజాయి మొక్క ఎలా పెరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే ఓయూ సెక్యూరిటీ ఆ మొక్కను పీకి పడేశారు. ఈ మొక్క సహజంగా మొలిచిందా? లేక ఎవరైనా నాటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపస్‌‌లో ఇలాంటి మొక్కలు మరెక్కడైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌‌లో తనిఖీలు నిర్వహించకపోవడమే ప్రధాన కారణమని విమర్శిస్తున్నారు. ఇదిలాఉంటే గతంలో యూనివర్సిటీలో ఉన్న గంధం చెట్టును నరికి తీసుకెళ్లినా, ఇప్పటివరకు వారిని పట్టుకోకపోవడం గమనార్హం.