కుటుంబ సమేతంగా తిరుచెందూర్‌లో అట్లీ.. రాకా సక్సెస్ కోసం మొక్కులు

కుటుంబ సమేతంగా తిరుచెందూర్‌లో అట్లీ.. రాకా సక్సెస్ కోసం మొక్కులు

తిరుచెందూర్: ప్రముఖ సినీ దర్శకుడు అట్లీ కుటుంబ సమేతంగా తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించారు. భార్య ప్రియా అట్లీ, కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను దర్శకత్వం వహిస్తున్న అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా ఘన విజయం సాధించాలని మురుగన్ స్వామిని ప్రార్థించినట్లు అట్లీ తెలిపారు.

అట్లీ.. తన భార్య ప్రియా అట్లీ, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్న అనంతరం ప్రాంగణంలోని పెరుమాళ్, షణ్ముగర్, దక్షిణామూర్తి, సూరసంహార మూర్తి తదితర దేవతామూర్తులను దర్శించుకున్నారు.అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

ఈ సినిమాకు గతంలో ‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం జరిగింది. తాజాగా ఈ చిత్రానికి ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.తన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ తిరుచెందూర్ మురుగన్ స్వామిని దర్శించుకున్నట్లు అట్లీ వెల్లడించారు. దీంతో ‘రాకా’ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

అట్లీ తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. ఆలయ ప్రాంగణంలో అట్లీ కనిపించగానే పలువురు అభిమానులు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అట్లీ కూడా చిరునవ్వుతో వారికి అభివాదం చేశారు.దీంతో కొద్దిసేపు తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ చిత్రం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.