చట్టాలను సవరించి వృద్ధులకు రక్షణ కల్పిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

చట్టాలను సవరించి వృద్ధులకు రక్షణ కల్పిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
  • వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పిస్తాం: మంత్రి అడ్లూరి

హైదరాబాద్, వెలుగు: వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోవటం లేదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చట్టాలను సవరించి వృద్ధులకు రక్షణ కల్పిస్తామన్నారు. వయోవృద్ధుల రక్షణ, గౌరవం, సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌‌జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పలు సంస్థలకు అవార్డులను మంత్రులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ వయోవృద్ధుల అనుభవం, ఆలోచనలు సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమన్నారు. “వయోవృద్ధులను సమాజానికి మార్గదర్శకులుగా, బ్రాండ్ అంబాసిడర్లుగా గౌరవించాలి. తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతం. వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ బస్ పాస్‌‌లు ఇవ్వాలన్న డిమాండ్‌‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని మంత్రి తెలిపారు.

వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి అడ్లూరి

వృద్ధుల గౌరవం, భద్రత, ఆరోగ్యం, ఆర్థిక భరోసాకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్ అన్నారు. వృద్ధులు తమ సమస్యలను చెప్పుకునేలా ప్రతి జిల్లాలో ప్రత్యేకాధికారిని నియమించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వృద్ధుల హక్కుల పరిరక్షణ, ఫిర్యాదుల పరిష్కారాన్ని జిల్లా స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.