సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు భర్తీ చేయాలి.. మంత్రి జూపల్లి ఆఫీస్ ఎదుట కళాకారుల ఆందోళన

సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు భర్తీ చేయాలి.. మంత్రి జూపల్లి ఆఫీస్ ఎదుట కళాకారుల ఆందోళన

రవీంద్రభారతి, వెలుగు: సాంస్కృతిక సారథిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌‌ చేస్తూ కళాకారులు గురువారం రవీంద్రభారతిలో ఆందోళనకు దిగారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆఫీస్​ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మంత్రి ఆఫీస్​ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌‌ను అడ్డుకొని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సాంస్కృతిక సారథిలో 1,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌‌ చేశారు. ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ఏళ్లుగా కళారంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న తమకు ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పలువురు మహిళా కళాకారులు కన్నీటి పర్యంతమై తమకు ఉద్యోగాలు కల్పించాలని మంత్రిని వేడుకున్నారు. మంత్రి జూపల్లి స్పందిస్తూ.. పది రోజుల్లో వారి సమస్యలపై సానుకూల ప్రకటన చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కళాకారులు ఆందోళన 
విరమించారు.