హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు పెంచేలా ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. రిజర్వేషన్లు పెంచాలంటే రాజకీయ నిర్ణయంతోనే సాధ్యమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ అనుకుంటే బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు కొట్టి వేస్తుందని తాము ముందే ఊహించామన్నారు.
గతంలో తెలంగాణ, బీహార్ రాష్ట్రాలలో కూడా కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచితే రెండు రాష్ట్రాల హైకోర్టులు కొట్టివేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టకుండా తక్షణమే ప్రధానితో భేటీ జరుపాలన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ను తొలగించేలా కృషి చేయాలన్నారు. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు .
