- కుటుంబ సభ్యుల వివరాలు కోరిన అధికారులు.. వచ్చే నెలలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ
హైదరాబాద్, వెలుగు: కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబంలో ఒకరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు సమాచారం. బుధవారం సిరిసిల్లలో జరిగిన సభలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో పద్మశాలి సామాజిక వర్గానికి ఒక అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలో పద్మశాలీలు గౌరవించే కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబం నుంచి ఒకరిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాపూజీ కుటుంబం నుంచి ఎవరికి రాజకీయ ఆసక్తి ఉంది? ఎవరికి అవకాశం ఇవ్వొచ్చనే దానిపై వివరాలు సేకరించాలని అధికారులు, సీఎంవోకు సీఎం సూచించినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో సమావేశమై ఈ అంశంపై చర్చించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యుల వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా సిరిసిల్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో వచ్చే నెలలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ హామీతో పద్మశాలి సామాజిక వర్గం నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది.
