- రాహుల్ మెప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డి అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నడు: కిషన్‌రెడ్డి
- తను సోనియా కుటుంబానికి, మజ్లీస్‌కు బానిస
- ఓట్లను కాదు.. ప్రజల హృదయాలు చోరీ చేస్తామని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో సోనియా కుటుంబానికి, హైదరాబాద్ లో మజ్లీస్ కు సీఎం రేవంత్ రెడ్డి బానిసగా మారారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2023లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయకుండా.. రోజుకో కొత్త నాటకం తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ మెప్పు కోసం.. సనాతన ధర్మంపై, రాజ్యాంగ సంస్థలపై రేవంత్ రెడ్డి ఇలాంటి అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. భాష పేరుతో రెచ్చగొట్టం, ఉత్తరం, దక్షిణం మధ్య విభేదాలు సృష్టించడం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కు చేస్తోంది. చివరకు ఇప్పుడు దేవుళ్ల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందని, ఇదే పాలసీని రేవంత్ రెడ్ది అవలంబిస్తున్నారు’ అని ఫైర్ అయ్యారు. రాముడు, శివుడు వేరంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఛీత్కరించుకుంటోందని చెప్పారు.
ప్రభుత్వం పోకుండా కాపాడుకోండి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కిషన్‌రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో, కర్నాటకలో, హిమాచల్ ప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. ‘బెంగాల్‌లో ఓటింగ్ శాతం పెరగడానికి సర్ ప్రక్రియే కారణం. దొంగ ఓట్లను తీసేయడంతోనే ఇది సాధ్యపడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే.. 2024 పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారే ఉంది. ఓట్ చోరీ జరిగిందని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. అప్పుడు మీరంతా ఏం చేశారు. కళ్లు మూసుకుని కూర్చున్నారా?’ అని ప్రశ్నించారు.
ఖైరతాబాద్‌లో గెలిచేది బీజేపీనే..
ప్రధాని మోదీకి ఓట్ చోరీ చేయాల్సిన అవసరం లేదని, తాము ప్రజల హృదయాలను మాత్రమే చోరీ చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీతో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదని స్పష్టత ఇచ్చారు. ఈ విషయంలో కేటీఆర్ పగటి కలలు కనడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. సింగరేణి బొగ్గుకు అనుగుణంగా యాదాద్రి పవర్ ప్లాంట్ ఎందుకు నిర్మించలేదని.. ఎవరి కోసం ఇలా చేశారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ సీటు బీజేపీకే సొంతమని, ఈ విషయంలో ప్రజలంతా బీజేపీకి అనుకూలంగా ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వరకు స్వచ్ఛ భారత్ అభియాన్ నిర్వహిస్తున్నామన్నారు.
