జూలూరుపాడు, వెలుగు: నర్సింగ్ స్టూడెంట్ హరిణిని హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. గురువారం పోలీస్‌స్టేషన్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ పవన్‌కుమార్, ఇంద్రవల్లి హరిణి కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో 2020లో పంచాయితీ పెట్టగా విడిపోయారు.
ఇటీవల పవన్ తిరిగి హరిణితో చనువుగా ఉంటున్నాడు. పవన్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో సెప్టెంబర్ నుంచి అతడిని దూరం పెడుతోంది. దీంతో హరిణికి వేరే వారితో సంబంధం ఉందని పవన్ అనుమానం పెంచుకున్నాడు. గత నెల 22న హరిణి ఒక్కతే ఉన్న సమయంలో ఆమె ఇంటికి పవన్ వచ్చాడు. ఉద్యోగం లేదని, ప్రవర్తన బాగా లేదని పవన్ ప్రేమను హరిణి తిరస్కరించడంతో.. తనకు దక్కదని భావించిన పవన్ తన వెంట తెచ్చుకున్న బైక్ క్లచ్‌వైర్ ను మెడకు బిగించి చంపేశాడు.
ఆ తరువాత డెడ్‌బాడీని మరుగుదొడ్డి వెనక సందులో పడేసి పరారయ్యాడు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పవన్ ను అరెసట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
