ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని కూల్చేందుకు ఒమానీ కోపైలట్ చేసిన దుస్సాహసం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ ఘటన వెనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు తేలితే ఆ దేశంపై చాలా తీవ్రమైన దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. విమానంలో ఉన్న 180 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను బలిగొనేందుకు జరిగిన ఈ యత్నాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు.
తెలియని కోణాలపై దర్యాప్తు..
ఈ విమాన దాడికి, టెహ్రాన్‌కు మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. తాము ప్రస్తుతం దానిపైనే పనిచేస్తున్నామని, తనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే దీనికి సమాధానం 'అవును' అనే చెప్పాలి అంటూ బదులిచ్చారు. అయితే ఇరాన్ ప్రమేయంపై ఆయన నేరుగా ఎలాంటి ఆధారాలు చూపనప్పటికీ.. ఒకవేళ వారు కనుక దీని వెనుక ఉంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
విమానంలో ఏం జరిగింది?
యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో 182 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ వారే కాకుండా భారత్, యూఏఈ పౌరులు, నలుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. విమానంలో కోపైలట్ సడన్‌గా కెప్టెన్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ రక్తసిక్తమైనప్పటికీ చాకచక్యంగా కాక్‌పిట్ డోర్ తెరిచి ప్రయాణికులను లోపల సహాయం పొందాడు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కోపైలట్‌ను నిలువరించి, విమానాన్ని సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఇస్లామిక్ భావజాలంతోనే దాడి?
ఈ దాడికి పాల్పడిన ఒమన్‌కు చెందిన కోపైలట్‌ను సౌదీ అరేబియా అరెస్ట్ చేసి యూఏఈకి అప్పగించింది. ఉగ్రవాదం నుంచి మెంటల్ హెల్త్ వరకు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. అయితే నిందితుడు ఇస్లామిక్ భావజాలంతో తీవ్రవాద ప్రేరేపణకు గురయ్యాడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఒమన్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేనప్పటికీ.. ఇజ్రాయెల్ వైమానిక నిబంధనల్లోని లూప్‌హోల్ ద్వారా ఈ కోపైలట్ విమానంలో ప్రవేశించినట్లు పేర్కొన్నారు.
పెరుగుతున్న ఉద్రిక్తతలు..
ఈ దర్యాప్తులో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ భద్రతా అధికారులు సౌదీ అరేబియాకు వెళ్లారు. నిందితుడిని తమ దేశానికి పంపాలని ఇజ్రాయెల్ కోరినప్పటికీ.. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. యూఏఈ కూడా ఈ ఘటనపై స్వయంగా దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. హమాస్ దాడికి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం పట్ల ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ.. మరోవైపు ట్రంప్ హెచ్చరికలు, అమెరికా సైనిక మోహరింపులు అంతర్జాతీయంగా పరిస్థితులను మళ్లీ హీటెక్కిస్తున్నాయి.
