మేడ్చల్‌‌ వెట్టిచాకిరీ ఘటనపై NHRC విచారణ

మేడ్చల్‌‌ వెట్టిచాకిరీ ఘటనపై NHRC విచారణ
  •     సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ

న్యూఢిల్లీ, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలో వెట్టిచాకిరీకి గురైన ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన 12 మంది కుటుంబ సభ్యుల ఉదంతాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌‌‌సీ) తీవ్రంగా పరిగణించింది. కార్మికులను కనీస వేతనాలు ఇవ్వకుండా భౌతికంగా, మానసికంగా వేధించడంతో పాటు అనారోగ్యకరమైన వాతావరణంలో ఉంచారు. ఒక సూపర్‌‌వైజర్‌‌ వారి వస్తువులను లాక్కోవడంతో పాటు కనీసం బయటకు వెళ్లకుండా నిర్బంధం విధించడంపై సామాజిక కార్యకర్తల ఫిర్యాదుతో రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులు బాధితులను కాపాడారు. 

ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్, పత్రికల్లో వచ్చిన వార్తలు నిజమైతే ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక కార్యకర్తల ఫిర్యాదుతో రెవెన్యూ, కార్మిక శాఖ అధికారులు స్పందించి బాధితులను రక్షించారు. ఈ వ్యవహారానికి సంబంధించి బాధితుల తరఫున తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌‌లకు ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ గురువారం నోటీసులు జారీ చేసింది.