సమాజంలో కొన్ని సంఘటనలు మనసును హత్తుకుంటాయి. అలాంటి ఒక అద్భుతమైన ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న 23 నెలల చిన్నారి వేదాంశ్ సింగ్ పాలిట అనంత్ అంబానీ ఆపద్బాంధవుడిగా నిలిచారు. వెన్నెముకకు సంబంధించిన 'స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ' (SMA టైప్ 1) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి వైద్యం కోసం రూ.9 కోట్లు అవసరం కాగా.. ఆ పూర్తి ఖర్చును తానే భరిస్తానని అనంత్ అంబానీ ముందుకు రావడం భావోద్వేగానికి గురిచేస్తోంది.
ముంబైకి చెందిన 26 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మయూరేష్ గుజార్ తన బృందంతో కలిసి వేదాంశ్ ప్రాణాలను కాపాడేందుకు గత కొన్ని వారాలుగా ఫండ్‌రైజింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ముంబై రోడ్లపై, సోషల్ మీడియా వేదికగా వారు చేసిన కృషితో సుమారు రూ.2కోట్ల 22లక్షలు మాత్రమే సేకరించగలిగారు. రూ.9 కోట్ల భారీ మొత్తం కావడంతో ఆ టీమ్ ఆందోళన చెందింది. అయితే సెప్టెంబర్ 21న ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజా గణేశుడి దర్శనానికి వెళ్లిన సమయంలో వారి జీవితంలో ఊహించని మలుపు తిరిగింది. మయూరేష్ బృందం పట్టుకున్న ఫ్లెక్సీలను చూసిన అనంత్ అంబానీ తన కారు ఆపి వారి దగ్గరకు వచ్చారు. సుమారు 5 నిమిషాల పాటు వారితో మాట్లాడారు. అంతే నిమిషాల్లో వైద్య సహాయానికి భరోసా కల్పించారు.
ఈ అద్భుత క్షణాన్ని పంచుకుంటూ మయూరేష్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. "వేదాంశ్ పరిస్థితి గురించి, మా మిషన్ గురించి అనంత్ అంబానీ సర్‌కు వివరించాను. చికిత్సకు ఎంత ఖర్చయినా సరే తానే భరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. చిన్నారిని తమ ఆసుపత్రికి తీసుకురావాలని చెప్పారు. ఆ క్షణంలో మాకు నోట మాట రాలేదు. నిద్రలేని రాత్రులు, పడ్డ కష్టమంతా ఒక్కసారిగా ఫలించినట్లనిపించింది" అంటూ మయూరేష్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం అనంత్ అంబానీ టీమ్ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నామని.. చిన్నారి వయసు 23 నెలలు నిండుతున్నందున ప్రతి క్షణం చాలా కీలకమని వారు తెలిపారు.
వైరల్ అవుతున్న వీడియో.. నెటిజన్ల ప్రశంసలు
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రూ.2 కోట్ల నుంచి రూ.9 కోట్లకు చేరుకునే ప్రయాణం అద్భుతం. అనంత్ అంబానీ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు అని ఒక యూజర్ కామెంట్ చేశారు. అనంత్ అంబానీ నిజమైన జెంటిల్‌మన్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సంపాదనలోనే కాదు, తోటి మనుషుల ప్రాణాలు కాపాడటంలోనూ అంబానీ కుటుంబం ముందుంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. చిన్నారి వేదాంశ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.
