సీఈసీ రాజీనామా చేయాలని.. ఢిల్లీ, ముంబైలో సీజేపీ నిరసనలు..పోలీసు దిగ్భంధంలో జంతర్ మంతర్

సీఈసీ రాజీనామా చేయాలని.. ఢిల్లీ, ముంబైలో సీజేపీ నిరసనలు..పోలీసు దిగ్భంధంలో జంతర్ మంతర్

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ, ముంబైలో అక్టోబర్ 2న నిరసనలు చేపట్టేందుకు వివిధ విద్యార్థి సంఘాలు, సీజేపీ పిలుపునిచ్చాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరగాల్సిన నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యూఢిల్లీలో BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగంగా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడంపై నిషేధం విధించారు. జంతర్ మంతర్‌కు వెళ్లే ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

నిరసనల క్రమంలో ఢిల్లీ మెట్రో 11 స్టేషన్లను మూసివేశారు. జంతర్ మంతర్, కనాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేశారు. 
మరోవైపు ముంబైలోని శివాజీ పార్క్ దగ్గర సీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల ప్రక్రియపై నిలిపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ  ముంబై, ఢిల్లీలో సీజేపీ, వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల  నేతృత్వంలో నిరసనలు చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) , ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) నిరసనల్లో పాల్గొన్నారు.