పద్మారావునగర్, వెలుగు: సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు మల్లేశ్ పోలీసు కస్టడీ ముగిసింది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 10 రోజుల పాటు నిందితుడిని విచారించిన బొల్లారం పోలీసులు.. కస్టడీ గడువు పూర్తి కావడంతో వైద్య పరీక్షల అనంతరం గురువారం సాయంత్రం సికింద్రాబాద్కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు ఆదేశాల మేరకు అనంతరం అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో భాగంగా నిందితుడి వద్ద లభ్యమైన అదనపు 800 బుల్లెట్లపై అధికారులు ఆరా తీయగా, అతడు ఎలాంటి సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేసినట్లు సమాచారం. అయితే ఈ భారీ ఆయుధాల చోరీ వ్యవహారంలో మల్లేశ్‌కు మరో ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు విచారణలో కీలక ఆధారాలు లభించాయి. బుల్లెట్లను ఎక్కడ నిల్వ చేశారు? ఈ ముఠా వెనుక ఉన్న అంతర్గత నెట్‌వర్క్ ఏమిటనే దానిపై పూర్తి వివరాలు రాబట్టేందుకు నిందితుడిని మరోమారు పోలీసు కస్టడీలోకి తీసుకునే అవకాశాలను దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది.
