16వ ఆర్థిక సంఘం గ్రాంట్లకు ప్రత్యేక ఖాతాలు..కేటాయించిన బ్యాంకుల్లోనే జీరో అకౌంట్లు తెరవాలని ఆదేశాలు

16వ ఆర్థిక సంఘం గ్రాంట్లకు ప్రత్యేక ఖాతాలు..కేటాయించిన బ్యాంకుల్లోనే జీరో అకౌంట్లు తెరవాలని ఆదేశాలు
  • 15 జిల్లాలకు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ, 16 జిల్లాలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలైన జిల్లా ప్రజా పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మండల ప్రజా పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, గ్రామ పంచాయతీలు 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల నిర్వహణ కోసం నూతన బ్యాంక్ ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి. దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. 

16వ ఆర్థిక సంఘం నిధుల జమ, ఖర్చులు అన్నీ పారదర్శకంగా నిర్వహించేందుకు కేటాయించిన బ్యాంకుల్లోనే జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లు ఓపెన్ చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర పంచాయతీ రాజ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఖాతాల నిర్వహణ, డిపాజిట్లు, చెక్కులపై సంతకాలు చేసే అధికారాలు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారమే ఉంటాయని పేర్కొన్నారు.

 స్థానిక సంస్థలు తమకు కేటాయించిన బ్యాంక్ శాఖల్లోనే అకౌంట్లు ఓపెన్ చేయాలని, 15 జిల్లాలకు ఎస్ బీఐ, 16 జిల్లాలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని తమ పరిధిలోని జడ్పీ, ఎంపీపీ, జీపీలచేత ప్రాధాన్యత ప్రాతిపదికన అకౌంట్లు ఓపెన్ చేయించాలని ఆదేశించారు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు తమ బ్రాంచ్ లకు ఆదేశాలు ఇచ్చి.. అకౌంట్ ఓపెన్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చూడాలని కోరారు.