కరీంనగర్ అభివృద్ధిపై ఎందుకు సమీక్ష చేయలె?

కరీంనగర్ అభివృద్ధిపై ఎందుకు సమీక్ష చేయలె?
  • సిరిసిల్లలో సీఎం వరాలకు బదులు బూతుల జల్లు కురిపించిండు : గంగుల 

కరీంనగర్ (సిరిసిల్ల), వెలుగు : 'కరీంనగర్ జిల్లాకు తొలిసారిగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నిధులు ఇస్తారని, వరాల జల్లు కురిపిస్తారని ఆశించాం.. కానీ బూతుల జల్లు కురిపించి వెళ్లారు' అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. 

గతంలో ఏ సీఎం కూడా ఇలా వ్యక్తిగత దూషణలు చేయలేదని, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన భాష మార్చుకోవాలని సూచించారు. గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డితో కలిసి సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్ సీఎం హోదాలో చాలా సార్లు వచ్చారని, ఎప్పుడు వచ్చినా నిధులు ప్రకటించేవారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై నిరసనలు వ్యక్తం కావడం, 22ఏ భూముల మీద వ్యతిరేకత వచ్చిందన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా లేనిపోని ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటైందన్నారు.

 కరీంనగర్ పక్కనే ఉన్న మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, డంపింగ్ యార్డు, తీగలగుట్టపల్లి ఆర్వోబీపై సీఎం ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ పట్ల ఈర్ష్యద్వేషాలతోనే కడుపు నిండా విషం నింపుకున్నారని, ఇంగిత జ్ఞానం ఉన్న ఎవ్వరూ కూడా అలా మాట్లాడరన్నారు. 

సిరిసిల్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే.. మంత్రి పదవి ఇస్తామని చెప్తున్నారని, అసలు వచ్చే ఎన్నికల్లో కొడంగల్ లో కాంగ్రెస్ గెలిచేలా చూసుకోవాలని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షడు తోట అగయ్య, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్, తుల ఉమ, వేములవాడ నియోజక ఇన్ చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఏనుగు మనోహర్ రెడ్డి 
పాల్గొన్నారు.