ఇండియా కాంపౌండ్ ఆర్చర్ గణేష్ మణిరత్నం తిరుమురు.. ఏషియాడ్‌లో డబుల్ ధమాకా సృష్టించాడు. మెన్స్ టీమ్‌లో స్వర్ణం గెలిచిన అతను వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించాడు.
గురువారం జరిగిన బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్‌లో గణేష్ 149–144తో కాంగ్ డుక్ డాంగ్ (వియత్నాం)పై గెలిచాడు. 15 షాట్లలో 14సార్లు గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించాడు. అయితే సెమీస్‌లో గణేష్ 144–148తో కిమ్ జోంగ్‌హో (సౌత్ కొరియా) చేతిలో ఓడాడు. స్టార్టింగ్ నుంచే ఇండియన్ ఆర్చర్ 29–-30, 29–-30, 29–-28, 29–-30, 28–-30 స్కోర్లతో వెనకబడ్డాడు. అంతకుముందు తెలంగాణ ఆర్చర్ చికితా తానిపర్తి మూడో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయింది.
కాంపౌండ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో చికిత 143–144తో నురిసా డయాన్ అఫ్రిఫా (ఇండోనేసియా) చేతిలో ఓడింది. ఇప్పటికే చికిత విమెన్స్ టీమ్, మిక్స్‌డ్ కాంపౌండ్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన సంగతి తెలిసిందే.
