కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగం రావట్లేదని వివాహిత సూసైడ్

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగం రావట్లేదని వివాహిత సూసైడ్
  •     కుషాయిగూడలో ఘటన
  •     మృతురాలి స్వస్థలం ఛత్తీస్‌‌గఢ్‌‌లోని రాయ్​పూర్‌‌

కుషాయిగూడ, వెలుగు: ఉద్యోగం రావట్లేదని మనస్తాపానికి గురైన ఓ వివాహిత సూసైడ్​చేసుకుంది. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఛత్తీస్‌‌గఢ్‌‌లోని రాయ్​పూర్‌‌కు చెందిన రిటైర్డ్​ఉద్యోగి రాజారామ్ మహాజన్ కూతురు స్వాతి మహాజన్​(30)కు పదేళ్ల క్రితం గోపాలకృష్ణ తులసీదాస్ వాఘలేతో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన తర్వాత ఈ దంపతులు యూకేలో ఉద్యోగాలు చేశారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌‌ వచ్చారు. కాప్రా మారుతి జూబ్లీ ఎన్​క్లేవ్‌‌లోని మ్యాప్లి హోమ్స్‌‌లో ఉంటున్నారు. 

ఇక్కడికి వచ్చాక భర్త మాత్రమే ఉద్యోగం చేస్తుండగా, స్వాతికి జాబ్​దొరక్క ఇంటివద్దే ఉంటోంది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని తరచూ తండ్రితో చెబుతూ బాధ పడుతుండేది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం పక్కింటి వ్యక్తి మహేశ్​స్కూల్ నుంచి స్వాతి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చాడు. పలుమార్లు తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో, వెంటనే గోపాలకృష్ణకు ఫోన్ చేశాడు. ఇంటికి చేరుకున్న అతను మహేశ్​సహాయంతో తలుపులు పగులగొట్టి చూడగా.. స్వాతి ఉరేసుకొని కనిపించింది. ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.