చేవెళ్ల, వెలుగు: కొత్త మున్సిపాలిటీలైన చేవెళ్ల, మొయినాబాద్‌లలో బార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు గురువారం చేవెళ్ల ఎక్సైజ్ఆఫీసులో ప్యూచర్ సిటీ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్శ్రీనివాస్ రెడ్డి టెండర్ నోటిఫికేషన్రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రాష్ట్రంలో 46 బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా.. వీటిలో చేవెళ్లలో ఒకటి, మొయినాబాద్ మున్సిపాలిటీలో రెండింటికి అవకాశం వచ్చిందన్నారు. ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఒక్కో అప్లికేషన్‌కు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఆఫీసర్ పేరిట రూ.లక్ష డీడీ కట్టాల్సి ఉంటుందన్నారు.
ఒక అభ్యర్థి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని, ఈ నెల 16న కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో విజేతలను ఎంపిక చేస్తారని తెలిపారు. డ్రా రోజున అభ్యర్థి హాజరు కాలేని పక్షంలో రూ.100 నాన్- జ్యుడీషియల్ బాండ్ పేపర్‌పై సంబంధిత వ్యక్తికి అనుమతి ఇస్తూ ఎక్సైజ్ శాఖకు ముందస్తుగా లేఖ అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైతే ఏటా లైసెన్స్ రుసుము రూ.30 లక్షలు నిర్ణయించామని, ఏడాదిలో 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉందన్నారు. అయితే, ఎంపికైన 90 రోజుల తర్వాత మొదటి విడతగా 1/4 వంతు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ కల్పన,ఎస్సై లలిత, సిబ్బంది పాల్గొన్నారు.
