బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్యపై.. ఎన్ హెచ్ఆర్‌‌సీ సీరియస్

బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్యపై.. ఎన్ హెచ్ఆర్‌‌సీ సీరియస్
  • నాలుగు నెలలుగా రిపోర్ట్ 
  • సమర్పించక పోవడంపై అసంతృప్తి
  • అక్టోబర్ 28న వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు 

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యార్థి శ్రీసాయి తేజ ఆత్మహత్య, ర్యాగింగ్ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) సీరియస్ అయింది. వెంటనే రిపోర్ట్ సమర్పించాలని, లేకుంటే వ్యక్తిగతంగా హాజరుకావాలని హయ్యర్ ఎడ్యుకేషన్  సెక్రటరీకి సమన్లు జారీ చేసింది. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై చర్యలు తీసుకుని నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని 23 ఏప్రిల్ 2026న తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిని ఎన్ హెచ్ఆర్ సీ ఆదేశించింది. అయితే, అధికారుల నుంచి స్పందన లేకపోవడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 

1993 నాటి మానవ హక్కుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం.. తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా లేదా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా అక్టోబర్ 28న మధ్యాహ్నం 2 గంటలకు నివేదికలతో హాజరు కావాలని ఆదేశించింది. అంతకంటే వారం రోజుల ముందు నివేదిక ఇస్తే వ్యక్తిగతంగా హాజరుకానవసరం లేదని స్పష్టం చేసింది. కాగా.. హాస్టల్​లో ఉంటోన్న శ్రీసాయి తేజ సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్, వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. ఈ ఘటనపై సభావత్ కళ్యాణ్ ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై గతంలో సెక్రటరీకి ఎన్​ ఎచ్​ఆర్​సీ నోటీసులు జారీ చేసింది.