చేర్యాల, వెలుగు: తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి సిద్దిపేట జిల్లా చేర్యాల పెద్ద చెరువుకు గోదావరి జలాలు వచ్చాయి. గురువారం చేర్యాల పెద్ద చెరువుకు గోదావరి జలాలు విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంత ప్రజల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద చెరువుకు గోదావరి జలాలను తీసుకురావడం హర్షణీయమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉంటే బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కృషితోనే గోదావరి జలాలు చేర్యాలకు వచ్చాయని పేర్కొంటూ ప్రత్యేక పూజలు చేశారు.
