న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ప్రశంసలతో ముంచెత్తారు. విమానంలో తనపై కత్తితో దాడి జరిగినప్పటికీ, అసాధారణ ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తితో వ్యవహరించి దాదాపు 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్‌ను ‘ఇండియా గొప్ప హీరో’ అని కొనియాడారు. ప్రయాణికులను సురక్షితంగా కాపాడినందుకు గాను ఇజ్రాయెల్ ప్రధాని, అధ్యక్షుడు, పార్లమెంట్ స్పీకర్ సహా యావత్ ఇజ్రాయెల్ ప్రజలు కెప్టెన్ స్మిత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
‘కత్తిపోట్లకు గురైనప్పటికీ కెప్టెన్ స్మిత్ ఏ మాత్రం బెదరకుండా కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు లోపలికి చేరుకుని దాడిని అడ్డుకోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. మరో పైలట్ వెంటనే ఫ్లైట్‌ను తన నియంత్రణలోకి తీసుకున్నారు. కెప్టెన్ స్మిత్ తన అనుభవం, పట్టుదలతో టెర్రరిజాన్ని ఓడించవచ్చని నిరూపించారు” అంటూ ఆయన కొనియాడారు.
