తిరుచానూరు: తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి ఆలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆలయంలో ఉన్న ఏనుగు మావటిని తొక్కింది. దీంతో.. భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో మావటి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మావటికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
వాహన మండపం దగ్గర మావటిపై ఏనుగు దాడి చేసింది. మొదట ఓ మావటిపై ఏనుగు దాడికి యత్నించింది. ఆపబోయిన మరో మావటిని ఏనుగు తొండంతో చుట్టి విసిరేసింది. మావటి చంద్రయ్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆస్థానంలో ఎనిమిది ఏనుగులు ఉన్నాయి. ఇవి ఆయా గుళ్ల పరిధిలో నిత్య వాహన సేవల్లో తరిస్తున్నాయి. ఇవి రోజూ ఉదయం తిరుమల ఆలయ మహాద్వారం వద్ద దర్శనమిస్తాయి. సాయం సంధ్యా సమయంలో పుర వీధుల్లో జరిగే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప తిరుచ్చి వాహన ఊరేగింపులో పాల్గొంటాయి.
పురాణాల ప్రకారం గజాలంటే ఐశ్వర్యానికి గుర్తు. శ్రీమహా విష్ణువు దేవేరి అయిన శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టవాహనం ఏనుగు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వర వైభవ, సిరి సంపదలకు సూచికలూ ఇవే. ఒక్కో ఏనుగు ఆలనా పాలనకు టీటీడీ ఏటా సుమారు 10 లక్షల రూపాయల దాకా ఖర్చు పెడుతోంది.
