కోర్టు అంటే కేవలం చట్టాలు, వాదనలు, తీర్పులు మాత్రమే కాదు.. అక్కడ కూడా రాజకీయాలు, ఆధిపత్య పోరులు, వ్యక్తిగత కక్షలు, కుట్రలు ఉంటే? అలాంటి కోర్టు వాతావరణాన్ని ఓ యువ లాయర్ దృష్టికోణంలో చూపించే ప్రయత్నమే ‘ది కోర్ట్’ వెబ్ సిరీస్ . న్యాయవాదుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో పాటు.. ఓ జూనియర్ లాయర్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లు, కేసుల వెనుక దాగి ఉన్న నిజాలు, వ్యక్తిగత జీవితాల్లోని రహస్యాలను మేళవిస్తూ ఈ సిరీస్ సాగుతుంది.
బాలా ఎస్బి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో యోగలక్ష్మి, జయప్రకాశ్, అర్జున్ శ్యామ్, గోపన్ మహాలక్ష్మి, సుదర్శనన్, ముక్తా జార్జ్, వివేక్ ప్రసన్న తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కథేంటో చూద్దాం.
కథేంటంటే:
లా పూర్తి చేసిన యాలిని (యోగలక్ష్మి) కొత్త ఆశలతో సిటీకి చేరుకుంటుంది. హైకోర్టులో జూనియర్‌గా స్థిరపడాలనే లక్ష్యంతో ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆమె, అనూహ్యంగా అడ్వకేట్ దేవా (అర్జున్ శ్యామ్) దగ్గర జూనియర్‌గా చేరుతుంది. అదే సమయంలో బార్ ఎలక్షన్స్ సమీపిస్తుండటంతో హైకోర్టులో సీనియర్ న్యాయవాదుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతుంది. తనకు ఛాంబర్ లేకుండా చేసిన సీనియర్ అడ్వకేట్ వేణి చంద్రకాంత్ (ముక్తా జార్జ్)పై దేవా అసహనంతో ఉండగా, ఆమె ఛాంబర్‌ను దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు.
15 ఏళ్లుగా కోర్టులో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న వేణి, ముత్తు, విశ్వ, కీర్తనలను జూనియర్లుగా నడిపిస్తుంది. కోర్టు క్యాంటీన్ నిర్వహించే సత్య, టీలు మోసే సుడాలి కోర్టులో జరిగే ప్రతి కదలికకు సాక్షులుగా ఉంటారు. యాలినిలోని తెలివితేటలను గుర్తించిన సత్య, ఆమె వేణికి జూనియర్‌గా చేరాలని కోరుకున్నా, ఆమె దేవా టీమ్‌లో చేరడం కొత్త సమీకరణాలకు దారితీస్తుంది. దేవాకు పదేళ్ల కూతురు దివి ఉండగా, ఆమె తల్లి గురించి యాలిని ఎప్పుడూ ప్రశ్నించదు. అయితే యాలిని ప్రతిభ, ఆమె స్వతంత్ర ధోరణి వేణి జూనియర్లకు అసహనంగా మారుతుంది. ఆమెను ఎలాగైనా దెబ్బతీయాలని వారు పన్నాగాలు మొదలుపెడతారు.
►ALSO READ | BHOGI Teaser: ‘భోగి’ టీజర్ గూస్ బంప్స్.. శర్వానంద్ ఊచకోతకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
కోర్టులోని రాజకీయాలు, సీనియర్ల మధ్య పోరు, ప్రత్యర్థుల కుట్రల మధ్య యాలిని ఒక్కో కేసును ఎదుర్కొంటూ తనను తాను నిరూపించుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో దేవా జీవితంలో దాగి ఉన్న నిజాలు, దివి తల్లి గురించి ఉన్న రహస్యం కూడా ఆమె ముందుకు వస్తాయి. మరి యాలిని ఈ న్యాయపోరాటంలో ఎలా నిలబడింది? ఆమె ఎదుర్కొనే కేసులు ఎలాంటి మలుపులు తీసుకొచ్చాయి? వేణి వర్గం పన్నిన కుట్రలు ఎక్కడికి దారితీశాయి? దేవా, దివి జీవితాల్లో దాగి ఉన్న నిజం ఏమిటి? అనేదే ఈ సిరీస్ కథ.
విశ్లేషణ:
‘ది కోర్ట్’ కేవలం కేసులు, వాదనల చుట్టూ సాగే లీగల్ డ్రామా కాదు. కోర్టులోని ఆధిపత్య పోరు, సీనియర్ల రాజకీయాలు, జూనియర్ లాయర్లపై ఒత్తిడి, కుట్రలు వంటి అంశాలను కథలో భాగం చేసింది. కొత్తగా లా పూర్తి చేసిన యాలిని.. సీనియర్ లాయర్ల మధ్య తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం ఆసక్తికరంగా సాగుతుంది. ఆమె ఎదుర్కొనే కేసులతో పాటు దేవా–దివి జీవితాల్లోని రహస్యాలు కథకు ఎమోషన్, సస్పెన్స్‌ను జోడిస్తాయి. అయితే ఒకేసారి కోర్టు రాజకీయాలు, కేసులు, వ్యక్తిగత కథలను నడిపించడం వల్ల కొన్ని చోట్ల కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. మొత్తంగా కోర్ట్‌రూమ్ డ్రామా, సస్పెన్స్, ఎమోషన్ కలగలిపిన సిరీస్‌గా ‘ది కోర్ట్’ ఆకట్టుకుంటుంది.
