IND vs PAK: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్‌కు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ దేశ ఆటగాళ్లకు నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOCs) జారీ చేయడానికి నిరాకరించడంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు టోర్నమెంట్ నుంచి పూర్తిగా నిష్క్రమించింది. దీంతో టోర్నీ ఆరంభంలోనే అనూహ్య నాటకీయత చోటు చేసుకుంది.
ఎన్ఓసీ నిరాకరించిన పీసీబీ.. టోర్నీ నుంచి పాక్ జట్టు ఔట్:
యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు WCL 2026 సీజన్ జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3వ తేదీన షార్జా వేదికగా బంగ్లాదేశ్ ఛాంపియన్స్‌తో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు తమ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ మొదట సాంకేతిక కారణాలతో వాయిదా పడిన ఈ మ్యాచ్, చివరకు పాక్ ప్లేయర్స్ కు బోర్డు ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో రద్దు చేయాల్సి వచ్చింది.
భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ క్యాన్సిల్:
ఇప్పటికే కెప్టెన్ షాహిద్ అఫ్రిది, సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు కొందరు పాక్ ఆటగాళ్లు యూఏఈ (షార్జా, దుబాయ్) చేరుకున్నప్పటికీ, బోర్డు అనుమతి లేకపోవడంతో వారు బరిలోకి దిగే అవకాశం లేకుండా పోయింది. గత ఏడాది (2025) డ్రామా కారణంగానే పాక్ క్రికెట్ బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో అక్టోబర్ 10న దుబాయ్ వేదికగా జరగాల్సిన హై-వోల్టేజ్ భారత్ ఛాంపియన్స్ vs పాకిస్థాన్ ఛాంపియన్స్ మ్యాచ్ కూడా అధికారికంగా రద్దయింది. ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఇప్పుడు పాక్ లేకుండానే పోటీలు కొనసాగనున్నాయి.
►ALSO READ | ఇరానీ కప్ విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా.. జమ్మూ కశ్మీర్‌పై 167 రన్స్ తేడాతో గెలుపు
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం:
మరోవైపు టోర్నమెంట్‌లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ అద్భుత ఆరంభాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) చెలరేగిపోయాడు. కేవలం 44 బంతుల్లోనే అద్భుతమైన 71 రన్స్ కొట్టి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా తరఫున డీఆర్సీ షార్ట్ (65), జో బర్న్స్ (45) పోరాడినప్పటికీ, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలింగ్‌లో ధవల్ కులకర్ణి 4 వికెట్లు పడగొట్టగా, మోహిత్ శర్మ 3 వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కట్టడి చేశారు. ఫలితంగా ఇండియా ఛాంపియన్స్ జట్టు 46 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది.
