లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అంజాద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్లో నివాసం ఉండే సాయినాథ్ తన భార్య ఇద్దరు కుమార్తెలు, దగ్గరి బంధువు విశ్వంత్, అతని భార్యతో కలిసి కారులో శనివారం రాత్రి.. కూకట్ పల్లిలోని పీవీఆర్ సినిమా మాల్లో సెకండ్ షో సినిమా చూశారు. అనంతరం సాయినాథ్ కుమార్తెల్లో ఒకరైన శారక్షి(6) పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున సుమారు 2:15 నిమిషాలకు పుట్టిన రోజు వేడుకల కోసం ట్యాంక్ బండ్ చేరుకున్నారు.
కారును సాయినాథ్ సైడ్కు ఆపిన తర్వాత విశ్వంత్ 6 సంవత్సరాల సరాక్షిని చేతుల్లో పట్టుకొని ట్యాంక్ బండ్ పైన హుస్సేన్ సాగర్ వైపుకు కాలినడకన రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో రాజస్థాన్కు చెందిన లారీ అతివేగంతో అటుగా వెళుతూ ఇద్దరినీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. శారక్షిని కిమ్స్ ఆస్పత్రికి, విశ్వంత్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అయితే కిమ్స్ ఆసుపత్రి వైద్యులు శారక్షి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విశ్వంత్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. సాయినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్ ఫరూఖ్, హెల్పర్ సైయీద్ ఖాన్ అదుపులోకి తీసుకున్నామని తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
