సెప్టెంబర్‌‌ చివరికల్లా దేవాదుల నీటిని లిఫ్ట్‌‌ చేయాలి: 9 మోటార్లను 45 రోజుల పాటు నిరంతరం నడపండి

సెప్టెంబర్‌‌ చివరికల్లా దేవాదుల నీటిని లిఫ్ట్‌‌ చేయాలి: 9 మోటార్లను 45 రోజుల పాటు నిరంతరం నడపండి

హనుమకొండ/హసన్‌‌పర్తి, వెలుగు: దేవాదుల ఎత్తిపోతల పథకం నుంచి సెప్టెంబర్‌‌ చివరి వరకు గోదావరి నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించాలని ఇరిగేషన్‌‌ ఈఎన్‌‌సీ రమేశ్‌‌ను ఉమ్మడి వరంగల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్‌‌ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, యశస్వినిరెడ్డి కోరారు. ప్రాజెక్టులోని 9 మోటార్లను నిరంతరం నడిపి.. ఆగస్టు 15 నుంచి రైతులకు సాగునీరు అందించాలని సూచించారు.

మంగళవారం హనుమకొండ జిల్లా చింతగట్టులోని ఇరిగేషన్‌‌ కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. దేవాదుల ప్రాజెక్టు నీటి నిర్వహణ, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పంప్‌‌హౌస్‌‌ల పనితీరు, సాగు, తాగునీటి సరఫరాపై సమీక్షించారు. 

45 రోజుల్లో 15 టీఎంసీలు..

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 9 మోటార్లతో రోజుకు సుమారు 2 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందన్నారు. 45 రోజుల్లో దాదాపు 15 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్‌‌లో వర్షాలతో పాటు గోదావరిలో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉన్నందున సమ్మక్క బ్యారేజీని పూర్తిస్థాయిలో నింపి ఉంచాలని సూచించారు. ధర్మసాగర్‌‌ నుంచి ఘన్‌‌పూర్‌‌ వరకు టన్నెల్‌‌ పనులు పూర్తయినా ఇంకా వినియోగంలోకి రాలేదని, వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దేవాదుల ఫేజ్‌‌-3 ప్యాకేజీ-6 పనులు నత్తనడకన సాగుతుండటంపై కడియం శ్రీహరి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. భీం ఘన్‌‌పూర్‌‌ నుంచి వచ్చే నీటిని రామప్ప చెరువు, వంగపెల్లి వానిచెరువు మీదుగా గణపసముద్రం చెరువును నింపాలని సూచించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌‌ నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన నీటిని కాల్వల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఈఎన్‌‌సీ రమేశ్‌‌, సీఈ సుధీర్‌‌, ఎస్‌‌ఈలు సీతారాం, దర్శన్‌‌, డీఈలు, ఈఈలు, ఇతర అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.