పోలవరం ముంపు నుంచి రక్షించండి.. కేంద్ర జలశక్తి శాఖకు ఇరిగేషన్శాఖ లేఖ.. తెలంగాణ డిమాండ్లు ఇవే!

పోలవరం ముంపు నుంచి రక్షించండి.. కేంద్ర జలశక్తి శాఖకు ఇరిగేషన్శాఖ లేఖ.. తెలంగాణ డిమాండ్లు ఇవే!

హైదరాబాద్, వెలుగు: ఏపీలోని ఏలూరు జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో తెలంగాణ భూభాగానికి పెను ముప్పు పొంచి ఉందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్ 45.72 మీటర్లు) వద్ద బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచలం పరిసర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ముంపు ప్రాంతాల్లో వెంటనే కరకట్టల నిర్మాణం, పంపింగ్ ఏర్పాట్లు తదితర రక్షణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ సెక్రటరీ శ్రీధర్​.. కేంద్ర జలశక్తి శాఖకు ఇటీవల లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సీఈవో.. తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి భద్రాచలం, ముంపు ప్రభావం ఉండే వాగుల వద్ద ఇటీవల క్షేత్రస్థాయి పరిశీలన చేశారని గుర్తుచేశారు. గోదావరికి ఇరువైపులా ఉన్న కిన్నెరసాని, పెద్దవాగు, ఎదుళ్లవాగు, తురుబాక, ఎటపాకతో పాటు స్థానిక వాగులు, పోలవరం ఎఫ్ఆర్ఎల్ సరిహద్దులను పరిశీలించారని పేర్కొన్నారు.  

నీటి మట్టం కంటే కిందనే స్లూయిజ్‌‌లు..

భద్రాచలం పట్టణంలో వరద నీరు వెనక్కి రాకుండా చూసేందుకు గతంలో నిర్మించిన ఔట్​ఫాల్ రెగ్యులేటర్లు.. పోలవరం ప్రాజెక్ట్​లెవెల్​కన్నా తక్కువ ఎత్తులోనే ఉన్నాయని లేఖలో సెక్రటరీ పేర్కొన్నారు. ఎటపాక, కొత్త కాలనీ, విస్టా కాంప్లెక్స్, సుభాష్‌‌నగర్ కాలనీల వద్ద ఉన్న ఔట్ ఫాల్ రెగ్యులేటర్లన్నీ పోలవరం ఎఫ్ఆర్ఎల్ 45.72 మీటర్ల కంటే దిగువన ఉన్నాయని పీపీఏ సీఈవో పరిశీలనలో గుర్తించారని చెప్పారు.

పోలవరంలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ ఉంచితే గోదావరి నుంచి బ్యాక్ వాటర్ ఈ స్లూయిజ్‌‌ల ద్వారా రివర్స్ వచ్చి ఆయా కాలనీలను, భద్రాచలం పట్టణాన్ని పూర్తిగా ముంచెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణ, అణు ఇంధన రంగాల్లో అత్యంత కీలకమైన మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ -కార్యక లాపాలపైనా పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపారు. ప్లాంట్ మౌలిక వసతులు, నిర్వహణపై బ్యాక్ వాటర్ ప్రభావం గురించి ఆ ప్లాంట్ ఉన్నతాధికారులతోనూ చర్చించినట్లు తెలిపారు. ఇదే విషయంపై భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఆందోళనలు లేవనెత్తారని కేంద్రానికి వివరించారు. 

తెలంగాణ ప్రధాన డిమాండ్లు ఇవే..!

పీపీఏ సీఈవో పరిశీలన నేపథ్యంలో.. పోలవరం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​తో రాష్ట్రంలో కలిగే ముంపు నుంచి రక్షణ చర్యలు వేగవంతం చేయాలని సెక్రటరీ శ్రీధర్​ లేఖలో తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని ఆరు స్థానిక వాగులపై డ్రైనేజీ కంజెషన్ స్టడీని స్పీడప్​ చేయాలన్నారు. ఇప్పటికే ఐదు వాగులకు సంబంధించిన క్రాస్ సెక్షనల్ సర్వే వివరాలను అందించిందని, వాటికి సంబంధించిన నివేదికను ఫైనలైజ్​చేయాలన్నారు. ముంపు ప్రాంతాల సరిహద్దులను (డీమార్కేషన్​)ను నిర్ధారించాలని కోరారు. ముంపు ప్రభావాన్ని అడ్డుకోవడానికి రక్షణ గోడలు లేదా కరకట్టల నిర్మాణం చేపట్టాలన్నారు. ముంపు బారిన పడే కాలనీల నుంచి నీటిని నదిలోకి ఎత్తిపోసేందుకు పంపింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు, అవసరమైన భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రానికి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.