పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. వినాయక నిమజ్జనాల సమయంలో అర్థరాత్రి వరకు మోగుతున్న మైక్‌లు, డీజే శబ్దాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. దీంతో ఆమె సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద అర్థరాత్రి వరకు సాగిన డీజే మోతల పట్ల రేణు దేశాయ్ అసహనం వ్యక్తం చేశారు. చదువుకున్న మానవులు సమాజానికి మేలు చేయడం కంటే పెద్ద ఉపద్రవంగా మారారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. సూర్యాస్తమయం ముందే సమస్త పూజలు, నిమజ్జనాలు పూర్తి కావాలన్నారు. అర్థరాత్రిళ్లు మందు తాగి రోడ్లపై పిచ్చిపిచ్చి డ్యాన్సులు చేయడం మన సంప్రదాయం కాదని హితవు పలికారు.
దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, అసభ్యకరమైన ట్రోలింగ్ రావడంతో రేణు దేశాయ్ మరో వీడియో విడుదల చేసి గట్టి కౌంటర్ ఇచ్చారు. 'నేను 18వ అంతస్తులో, సౌండ్ ప్రూఫ్ గదిలో ఉంటాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నగరంలో వైరల్ జ్వరాలతో బాధపడుతున్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి ఏంటి? మానవుల అంత్యక్రియలే సాయంత్రం 6 దాటితే చేయరు.. అలాంటిది దేవుడి నిమజ్జనం రాత్రిళ్లు ఎలా చేస్తారు? అసలు డ్యాన్సులు చేసేవాళ్లలో ఎంతమందికి 'గణపతి అథర్వశీర్షం' తెలుసు? లోకమాన్య తిలక్ ఐక్యత కోసం గణేశ్ ఉత్సవాలు ప్రారంభిస్తే.. మీరు డీజే పార్టీలుగా మార్చేశారు. ప్రశ్నించిన ఒక మహిళపై బూతులతో దాడి చేయడమేనా మీ సనాతన ధర్మం? అంటూ ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తాను గత రెండు దశాబ్దాలుగా గణపతిని నిష్టగా ఆరాధిస్తున్న గర్వించదగిన సనాతనినని, ధర్మానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఆనందంగా, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోండి కానీ, ఎదుటివారికి ఇబ్బంది కలిగించకండని అని హితవు పలికారు. రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
