- యూట్యూబ్ కెమెరాలకు తమ వైభోగం చూపిన నేతలు
- వెండి సోఫాలు, ఇటాలియన్ మార్బుల్, అదో రాయల్ దర్బార్
- ఆ శాసన సభ్యుడి ఇంటి ఇంటీరియర్స్ రూ.45 కోట్లు
- ఇంటి నిండా లగ్జరీ కార్లు..
- ఆ ఎమ్మెల్యేలకు అవంటే ఇష్టం
- వీడియోల స్క్రీన్ షాట్లు తీసి.. ఎలక్షన్ అఫిడవిట్లు బయటికి లాగి..
- నేతల ఆస్తుల లెక్కలు వేస్తూ.. ఎక్కడివంటున్న సోషల్ మీడియా
హైదరాబాద్, వెలుగు: కెమెరా ముందుకు కదిలింది.. ఖరీదైన విదేశీ డోర్లు తెరుచుకున్నాయి.. లోపలికి అడుగుపెడితే కళ్లు జిగేల్మనే ఇటాలియన్ మార్బుల్.. నడిస్తే పాదాలు మునిగిపోయే ఇంపోర్టెడ్ కార్పెట్లు.. నెత్తిన వేలాడే లక్షల విలువైన షాండ్లియర్లు.. కూర్చుంటే రాచరికపు అనుభూతినిచ్చే వెండి సోఫాలు.. ఇవీ రాష్ట్రంలోని చాలా మంది లీడర్ల విలాసవంతమైన భవంతులు. తమ లైఫ్ స్టైల్ జనానికి చూపించి మా నాయకుడు గ్రేట్ అనిపించుకుందామనుకున్న నేతలకు సీన్ రివర్స్ అయింది.
ఒకవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్ లు, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విరుచుకుపడి, కాంగ్రెస్ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి నిలదీస్తున్న వేళ.. మరోవైపు అధికార, ప్రతిపక్షాల నేతలు యూట్యూబ్ కెమెరాలను ఇళ్లలోకి ఆహ్వానించి ఇచ్చిన ‘హోమ్ టూర్’ వీడియోలు నెట్టింట కలకలం రేపుతున్నాయి.తమ లైఫ్ స్టైల్ తో ‘ఇమేజ్’ పెంచుకుందామనుకుంటే.. ఆ వీడియోల్లో కనిపించిన వైభోగం చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. జనాలు ఒక్కో రూపాయి కూడబెట్టి చిన్న ఇల్లు కొనుక్కోవడానికి జీవితకాలం పడుతుంటే.. వీళ్లు ఇన్నేసి ఆస్తులు ఎలా కూడబెట్టారని ప్రశ్నిస్తున్నారు.
- ఇల్లా.. ఊరా..
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఇల్లును చూసి ‘అది ఇల్లా.. ఊరా?’ అని నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన జిమ్, హోమ్ థియేటర్, భారీ కాంపౌండ్ లోపల విస్తరించిన ల్యాండ్ స్కేప్ గార్డెనింగ్, అరుదైన మొక్కలు ఆయన ఇంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్కెట్ రేట్ల ప్రకారం రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్ల పైమాటేనని నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. ఒకప్పుడు సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయిన సదరు నేతకు ఇంత పెద్ద ఇల్లు, ఆస్తులు ఎలా వచ్చాయని యూట్యూబ్ వేదికగానే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి అయ్యాకే ఈ స్థాయిలో కూడబెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు.
ప్రకృతి ఒడిలో రాచరికం
సిటీ శివారులో ఓ బీజేపీ ఎంపీకి చెందిన ఇంటిని చూపించిన వీడియోలు గతంలోనే వైరల్ అయ్యాయి. పచ్చని చెట్లు, ఎకరాల కొద్దీ స్థలం, పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా ఉన్నప్పటికీ, ఆ ప్రాంగణం విస్తీర్ణం, దాని మార్కెట్ విలువ చూస్తే కళ్లు చెదరాల్సిందే. ఆ ప్యాలెస్ విలువ కనీసం రూ.50 కోట్లు ఉంటుందని ఎక్స్ పర్ట్స్ అంచనా.
ఇంటి నిండా లగ్జరీ కార్లు..
సిటీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన విలాసవంతమైన భవనంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆయన ఆస్తిపాస్తుల వైభవాన్ని చాటాయి. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో భారీ ప్రాంగణం, అందులో పార్క్ చేసి ఉన్న లగ్జరీ కార్ల శ్రేణి చూస్తే ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎదిగిన తీరు స్పష్టమవుతుందని చెబుతున్నారు. ఈ ప్రాపర్టీ విలువ రూ.30 కోట్లకు తక్కువ ఉండదన్నది టాక్.
సోషల్ మీడియా ఆడిట్
ఒకప్పుడు ప్రజాప్రతినిధులు సాధారణ జీవితం గడిపేవారు. దివంగత పీవీ నర్సింహారావు లాంటి మహా నాయకులు తమ ఆస్తిపాస్తులను పేదలకు పంచి, పాత భవంతుల్లోనే కాలం వెళ్లదీశారు. పెంకుటింట్లో నివసిస్తూ బస్సులో తిరిగే గుమ్మడి నర్సయ్య లాంటి ఎమ్మెల్యేలనూ చూశాం. కానీ ప్రస్తుత నేతలు ఇలా ఎమ్మెల్యే కాగానే అలా కోట్లు కూడబెట్టి, భారీ భవంతుల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు.
ఇన్నాళ్లూ వీరి వ్యక్తిగత జీవితం నాలుగు గోడల మధ్యే ఉండేది. కానీ ఇప్పుడు వ్యూస్ కోసం, ఫ్యాన్స్ కోసం యూట్యూబ్ చానళ్లను లోపలికి రానిచ్చి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వీడియో రాగానే నెటిజన్లు ‘స్క్రీన్ షాట్లు’ తీస్తున్నారు. ఒకప్పుడంటే నేతలను ప్రశ్నించడం సాధ్యం కాకపోయేది. ఇప్పుడు డిజిటల్ యుగం.. నేతలను జనం ఓ ఆట ఆడుకుంటున్నారు. హోమ్ టూర్లలో బయటపడిన వాళ్ల ఆస్తుల లెక్కలను సోషల్ మీడియాలోనే తేల్చేస్తున్నారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఏ బ్రాండ్? దాని ఖరీదు ఎంత? గచ్చుకు వేసిన మార్బుల్ ఏ దేశం నుంచి వచ్చింది? అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్లో వేసి వెతికేస్తున్నారు.
ఈసీఐలో పెట్టిన అఫిడవిట్ డౌన్లోడ్ చేసి.. వాళ్ల ఇండ్లలోని ఆస్తులను చూపించారా? అంటూ కామెంట్ బాక్సుల్లో నిలదీస్తున్నారు. ‘మేం ప్రజాసేవ కోసం వచ్చాం.. ప్రజల కోసమే బతుకుతున్నాం’ అని వేదికలెక్కి ఉపన్యాసాలు దంచే నాయకులు, తెరవెనుక రాజుల కాలం నాటి జమీందారుల్లా బతుకుతున్నారనే చేదు నిజాన్ని ఈ ‘హోమ్ టూర్లు’ బట్టబయలు చేశాయని నెటిజన్లు చెప్తున్నారు. సామాన్యులు గుంట జాగ కొనలేక, ఇల్లు కొంటే ఈఎంఐలు కట్టలేక సతమతమవుతుంటే ప్రజాసేవకుల ముసుగులో ఈ రాచరికపు వైభోగాలేంటి?’’ అని ప్రశ్నిస్తున్నారు.
ఇల్లు కాదు.. ప్యాలెస్
బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన ఓ మాజీ మంత్రి నివాసం చూస్తే కార్పొరేట్ కంపెనీ హెడ్ క్వార్టరా? ఫైవ్ స్టార్ రిస్టార్టా? అని అనిపించక మానదు. స్వయంగా సివిల్ఇంజినీర్ అయిన సదరు నేత తన సొంత జిల్లాతోపాటు హైదరాబాద్ లో నిర్మించిన ఇండ్లు విలాసానికి చిరునామాగా మారాయి. అత్యంత ఎత్తైన ప్రదేశంలో భారీ ఆర్కిటెక్చరల్ డిజైన్ తో విశాలమైన లాన్లు, లగ్జరీ వుడెన్ వర్క్, వందలాది మంది కూర్చునే విజిటర్స్ లాంజ్ కళ్లు తిప్పుకోనీయవు. ప్రధాన గేటు దాటి లోపలికి వెళ్లడానికే పెద్ద రోడ్డు ఉంటుంది. ఇంటి ఎలివేషన్ ను కార్పొరేట్ స్థాయిలో డిజైన్ చేశారు. ఈ ప్రాపర్టీ విలువ మార్కెట్ రేటు ప్రకారం కనీసం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల దాకా పలుకుతుందని సమాచారం.
వెండి సోఫాలు.. రాయల్ దర్బార్
ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే హోమ్ టూర్ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు తెరలేపింది. ఆయన నియోజకవర్గంలోని ఈ ప్యాలెస్‌లో కాలు పెడితే అంతా రాయల్ లుక్. హాల్లో పూర్తి వెండితో డిజైన్ చేసిన భారీ సోఫా సెట్, వెండి కుర్చీలు, విదేశీ కళాఖండాలు జిగేల్ మనిపించాయి. బెడ్రూంలోని మంచం, సైడ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్, కాఫీ టేబుల్, కుర్చీలు.. అన్నీ పూర్తి వెండి తాపడంతో తళతళలాడుతున్నాయి. పైకప్పుకు అరుదైన రోజ్‌వుడ్ సీలింగ్, హాల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే భారీ క్రిస్టల్ షాండ్లియర్లున్నాయి.
ఇవి ఆయనకు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించాయని ఆ ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇందులోని ఇంటీరియర్ విలువే రూ.30 కోట్ల నుంచి రూ.45 కోట్లకు పైగా ఉంటుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇంటర్వ్యూ సందర్భంగా సదరు ఎమ్మెల్యే స్వయంగా చేసిన కామెంట్స్ పై నెటిజన్లు నేరుగానే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో చూపిన ఆస్తులకు, కళ్లముందు కనిపిస్తున్న వెండి మెరుపులకు అసలు పొంతనే లేదంటున్నారు.
