ఓట్ల చోరీ.. గుర్తుల దోపిడీ.. పార్టీల దొంగతనం.. నిధుల గోల్ మాల్.. దేశంలో ఇదే జరుగుతోందన్న సీఎం రేవంత్

ఓట్ల చోరీ.. గుర్తుల దోపిడీ.. పార్టీల దొంగతనం.. నిధుల గోల్ మాల్.. దేశంలో ఇదే జరుగుతోందన్న సీఎం రేవంత్
  • సంఘ్ పరివార్ ప్రజలను విభజిస్తోంది
  • మతతత్వ శక్తుల నుంచి ప్రమాదం
  • దేశ ఐక్యతకు గాంధీ కుటుంబం కృషి
  • కేరళలో కాంగ్రెస్ పార్టీ గాలి మొదలైంది
  • తుఫానులా దేశమంతా విస్తరిస్తుంది
  • రాహుల్​గాంధీ ప్రధాని కావాలన్న సీఎం
  • ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ 
  • అవార్డు అందుకున్న రేవంత్

హైదరాబాద్ , వెలుగు : దేశంలో ఓట్ల చోరీ, పార్టీల దొంగతనం, ఎన్నికల గుర్తుల దోపిడీ, నిధుల మాయం జరుగుతున్నాయని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆరోపించారు. సంఘ్ పరివార్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం భారత్‌‌ను మతం, కులం, ప్రాంతం, భాష పేరిట ప్రజలను విభజిస్తోందని అన్నారు.  గాంధీ పరివార్ మాత్రం దేశం కోసం ప్రాణాలను, పదవులను తృణప్రాయంగా వదిలేసిందని చెప్పారు.  గాంధీ కుటుంబం దేశ ఐక్యతకు కృషి చేస్తోందని అన్నారు.  ఐడియా ఆఫ్ ఇండియా కోసం రాహుల్ దేశమంతా తిరుగుతున్నారని చెప్పారు.

దేశంలో యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఓటు హక్కును, వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో మతతత్వ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, స్వేచ్ఛ, లౌకికవాదం, రాజ్యాంగ విలువలను కాపాడటమే దివంగత నేత ఆర్యదాన్‌‌ ముహమ్మద్‌‌కు నిజమైన నివాళి అని రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు. కేరళలోని నిలంబూరులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌‌రెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్‌‌ ముహమ్మద్‌‌-2026 బెస్ట్‌‌ పబ్లిక్‌‌ సర్వెంట్‌‌ అవార్డు’ ప్రదానం చేశారు.  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌ చేతుల మీదుగా సీఎం రేవంత్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

కేరళ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ నాల్గో వర్ధంతి సందర్భంగా ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. ఈ పురస్కారం కింద రూ. లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను రేవంత్‌‌రెడ్డికి అందజేశారు. రైతులు, వెనుకబడిన వర్గాలు (బీసీలు), ఇతర సామాజిక వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధతను గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు.

పురస్కారం అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ నిపుణులు రుతుపవనాల కోసం కేరళ వైపు ఎలా చూస్తారో.. దేశ రాజకీయాలను అర్థం చేసుకునే విషయంలోనూ కేరళను ఒక సంకేతంగా (బెల్‌‌వెదర్) చూడవచ్చని అన్నారు. 1991లో కేరళలో కరుణాకరన్ సీఎంగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారని, 1996లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిందని చెప్పారు. 2001లో ఏకే ఆంటోనీ సీఎం కాగా, 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. 2026లో కేరళలో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధించడంతో కొత్త రాజకీయ గాలి మొదలైందని, కేరళ నుంచి మొదలైన ఈ గాలి దేశమంతా తుపానుగా మారాలని పిలుపునిచ్చారు. 

  • రాహుల్​ ప్రధాని కావాలి

దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌‌గాంధీలు ప్రాణత్యాగం చేశారని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు అధికారాన్ని, పదవులను త్యజించారని రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు చరిత్ర పిలుస్తోందని, రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందని, ఆయనను ప్రధానిగా చూడటమే తన ముందున్న ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. రాహుల్, ప్రియాంక గాంధీలు కేరళ నుంచి ఎంపీలుగా ఎన్నిక కావడం వల్ల తనకు ఈ రాష్ట్రంతో మరింత అనుబంధం ఏర్పడిందని చెప్పారు.  8సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు వేర్వేరు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆర్యదాన్ ముహమ్మద్ సేవలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్.. అర్యదాన్ ముహమ్మద్ స్మారకోపన్యాసం చేశారు. ఆర్యదాన్ పేరిట ఉన్న అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా ఉందని, కేరళ వెలుపల నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తిగా నిలవడం తనకు మరింత ప్రత్యేకమని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తగా, రాహుల్ నాయకత్వంలోని బృందంలో ఒక కార్యకర్తగా తాను ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు.